నాడు జరగనున్న ప్రారంభ వేడుకకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. విద్యుత్
దీపాలతో పాలనా సౌధం ధగధగలాడుతోంది. విశాలమైన పచ్చిక బయళ్లు, భారీ ఫౌంటెయిన్లతో
చూపర్లను ఇట్టే ఆకట్టుకుంటోంది.
తెలంగాణ రాష్ట్ర నూతన పరిపాలనా సౌధం మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది.
ప్రారంభోత్సవం కోసం విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. మిగిలిన ల్యాండ్
స్కేపింగ్ సహా ఇతరత్రా పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. ప్రధాన
భవనానికి సంబంధించిన పనులన్నీ పూర్తి కావడంతో ప్రారంభోత్సవం కోసం సిద్ధంగా
ఉంది. రాజసం ఉట్టిపడుతోన్న ఈ అత్యాధునిక భవంతి చూపరులను ఆకట్టుకుంటోంది.
ఎత్తైన స్తంభాలు, భారీ గుమ్మటాలతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. విశాలమైన
పోర్టికోతో ఉన్న ప్రధాన ముఖ ద్వారం సచివాలయ సౌధం అందాన్ని ద్విగుణీకృతం
చేస్తోంది. రాజస్థాన్ దోల్ పూర్ ఎర్రటి ఇసుక రాతితో ఏర్పాటు చేసిన క్లాడింగ్
ఆకట్టుకుంటోంది. భవనానికి అమర్చిన రంగు రంగుల విద్యుత్ దీపాలు
కాంతులీనుతున్నాయి. వివిధ వర్ణాల మధ్య భవనం వెలిగిపోతోంది. భారీ భవనం ముందు
ఉన్న విశాలమైన పచ్చిక బయళ్లు మరింత సుందరంగా కనిపిస్తున్నాయి. లాన్స్‌లో
ఏర్పాటు చేసిన భారీ ఫౌంటెయిన్లు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి.
తెలంగాణ వైభవం ఉట్టి పడేలా
ఆదివారం రోజు జరగనున్న ప్రారంభోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
రహదార్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు.
తెలంగాణ వైభవం ఉట్టి పడేలా సచివాలయానికి లైటింగ్ వంటి సుందరీకరణ పనులపై
ప్రధానంగా దృష్టి సారించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన
కార్యదర్శి శాంతికుమారి పోలీసులు, ఆర్ అండ్ బీ అధికారులతో కలిసి సభ ప్రాంగణం,
వాహనాల పార్కింగ్, తదితర ఏర్పాట్ల పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
ప్రధాన భవనం ఇరువైపులా గ్రీనరీ
ప్రారంభం తర్వాత మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఉద్యోగులను ఉద్దేశించి
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించేందుకు వీలుగా ప్రత్యేక వేదికను కూడా ఏర్పాటు
చేస్తున్నారు. సచివాలయం వెలుపల రహదార్లను తీర్చిదిద్దుతున్నారు. ట్రాఫిక్
నుంచి ఇబ్బందులు ఉండకుండా కేవలం సచివాలయంలోకి వెళ్లే వాహనాల కోసం రహదారిపై
ప్రత్యేక రెయిలింగ్‌తో డివైడర్ నిర్మిస్తున్నారు. ప్రాంగణం చుట్టూ ఆకర్షణీయంగా
ఉండేలా వివిధ రకాల మొక్కలు ఏర్పాటు చేస్తున్నారు. అధికారులు, పోలీసుల
సమన్వయంతో సచివాలయ ప్రారంభోత్సవ వేడుక విజయవంతం అయ్యేలా చూడాలని మంత్రి
ప్రశాంత్ రెడ్డి సూచించారు.