మేకిన్ ఇండియా అంటే పీ.ఎస్.యు.ల ప్రైవేటీకరణనా..?
రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్
వినోద్ కుమార్ తో మెదక్ ఆర్డినెన్సు ఫ్యాక్టరీ జే.ఏ.సీ. నాయకుల భేటీ
హైదరాబాద్ : కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటి నుంచి పబ్లిక్
సెక్టార్ యూనిట్స్ ( పీ.ఎస్.యు ) ప్రైవేటీకరణ పరంపర కొనసాగుతోందని, చివరికి
దేశానికి రక్షణ కల్పించే రక్షణ శాఖకు కూడా ప్రైవేటీకరణ గండం తప్పడం లేదని
రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.
మంగళవారం మంత్రుల నివాసంలో మెదక్ ఆర్డినెన్సు ఫ్యాక్టరీ పరిరక్షణ జే.ఏ.సీ.
నాయకులు వినోద్ కుమార్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్
మాట్లాడుతూ లాభాల బాటలో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా
ప్రైవేటీకరణ చేస్తున్న కేంద్ర బిజెపి ప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టారు. మేకిన్
ఇండియా ముసుగులో పీ.ఎస్.యు.లను ప్రైవేట్ బాట పట్టిస్తున్న ప్రధాని నరేంద్ర
మోడీ వైఖరి ఏమాత్రం సరికాదని వినోద్ కుమార్ అన్నారు. మెదక్ ఆర్డినెన్సు
ఫ్యాక్టరీకి వర్క్ ఆర్డర్ ఇవ్వకుండా సిక్ యూనిట్ గా చిత్రీకరించి మూసి
వేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని, ఈ కుట్రలను తిప్పి కొడతామని వినోద్ కుమార్
అన్నారు.
మెదక్ ఆర్డినెన్సు ఫ్యాక్టరీలో యుద్ద ట్యాంకర్స్, బుల్లెట్ ప్రూఫ్, ల్యాండ్
మైన్స్ ప్రూఫ్ వాహనాలు, లాంచర్స్ వంటి దేశ రక్షణ కోసం కీలక ఉత్పత్తులు
తయారవుతాయని వినోద్ కుమార్ పేర్కొన్నారు. మెదక్ ఆర్డినెన్సు ఫ్యాక్టరీకి వర్క్
ఆర్డర్ ఇవ్వాలని, ఈ ఫ్యాక్టరీలో పని చేస్తున్న సుమారు మూడున్నర వేల మంది
ఉద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడటం మానుకోవాలని వినోద్ కుమార్ కేంద్ర
ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. వినోద్ కుమార్ తో భేటీ అయిన వారిలో మెదక్
ఆర్డినెన్సు ఫ్యాక్టరీ జే.ఏ.సీ. నాయకులు రమణా రెడ్డి, ప్రభు, శ్రీనివాస్
రెడ్డి, రవీందర్ గౌడ్, శివ కుమార్, రాజయ్య, యాదగిరి, అశోక్, మల్లికార్జున్
రెడ్డి, ప్రభు, శివ శంకర్ నాయక్, బీ.ఆర్.ఎస్. కార్మిక విభాగం రాష్ట్ర
అధ్యక్షుడు రాంబాబు యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ, తదితరులు
ఉన్నారు.