-పొట్టి శ్రీరాములు త్యాగాన్ని కొనియాడిన ప్రకాష్ అంబేడ్కర్
-సమానత్వ మూర్తిని ఆవిష్కరించిన తెలంగాణా సీఎం కేసీఆర్
-ఏపీలో విగ్రహం పెడతామని మోసం చేసిన రెండు ప్రభుత్వాలు
-టీడీపీ, వైసీపీల చిత్తశుద్ధి లోపానికి ఇదే నిదర్శనం
హైదరాబాద్ : హైదరాబాద్ లోని ఎన్టీఆర్ మార్గ్ లో ఏర్పాటు చేసిన 125 అడుగుల
అంబేడ్కర్ విగ్రహాన్ని భారత జాతి గర్వపడేలా తెలంగాణా ప్రభుత్వం
తీర్చిదిద్దిందని భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు డాక్టర్ తోట
చంద్రశేఖర్ ప్రశంసించారు. భావితరాలకు స్ఫూర్తినిచ్చేలా ఈ సమానత్వ మూర్తిని
తీర్చిదిద్దినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు, ఆయన సహచర
మంత్రవర్గాన్ని చంద్రశేఖర్ అభినందించారు. ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావం కోసం
ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని ఈ కార్యక్రమంలో
బాబాసాహెబ్ మనవడు ప్రకాష్ అంబేడ్కర్ ప్రస్తావించడం కళ్లు చెమ్మగిల్లేలా
చేసిందని తోట చంద్రశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో త్యాగాల వల్ల ఏర్పడిన
ఆంధ్రప్రదేశ్, పోరాటాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఆదర్శ
రాష్ట్రాలుగా నిలవాలని డాక్టర్ తోట చంద్రశేఖర్ ఆకాంక్షించారు. కానీ నవభారత
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ని గౌరవించడంలో ఏపీని పాలించిన
రెండు ప్రభుత్వాలు విఫలం అయ్యాయని డాక్టర్ తోట చంద్రశేఖర్ విమర్శించారు.
అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా 125 అడుగు విగ్రహాన్ని పెడతామని రాజధాని
అమరావతి ప్రాంతంలో స్మృతి వనాన్ని ఏర్పాటు చేస్తామని గత తెలుగు దేశం ప్రభుత్వం
హామీ ఇచ్చిందని, మూడేళ్లలో మీనమేషాలు లెక్కిస్తూ కాలం గడిపేసిందని, ఆ తర్వాత
అధికారాన్ని కోల్పోయిందని ఆయన విమర్శించారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ
ప్రభుత్వం కూడా విజయవాడలోని స్వరాజ్ మైదానంలో 125 అడుగు అంబేడ్కర్ విగ్రహాన్ని
ఏర్పాటు చేస్తామని అడంబరంగా ప్రకటించింది, కానీ నాలుగేళ్లు గడిచినా 20శాతం
కూడా పనులు చేయలేదని తోట చంద్రశేఖర్ అన్నారు. పైగా దళితుల్ని వైసీపీ ప్రభుత్వం
ఘోరంగా వంచిందని, ఎస్సీ కార్పొరేషన్ నిధుల్ని కూడా దారి మళ్లించిందని
విమర్శించారు. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతి ఒక్కరూ హైదరాబాద్ లో ఏర్పాటు
చేసిన విగ్రహ సముదాయాన్ని సందర్శించి ఆమహనీయుని జీవితం నుంచి
స్ఫూర్తిపొందాలని… భారతీయ సమాజంలోని ఎన్నో సమస్యలకి అంబేడ్కర్ మహాశయుడు ఆనాడే
పరిష్కారాలు సూచించారని చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు.