హైదరాబాద్ : అంబేడ్కర్ విగ్రహావిష్కరణను వైభవంగా నిర్వహించడానికి సీఎం
కేసీఆర్ మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. అలాగే అంబేడ్కర్ ముని
మనవడును ఈ కార్యక్రమానికి ఆహ్వానించాలని చెప్పారు. ఏప్రిల్ 30న జరిగే
సచివాలయం ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈనెల 14న అంబేడ్కర్ విగ్రహావిష్కరణ వైభవోపేతంగా జరపాలని సీఎం కేసీఆర్
మంత్రులు, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హెలికాప్టర్ ద్వారా పూలజల్లు
కురిపించి పుష్పాంజలి ఘటించాలని తెలిపారు. మంగళవారం సచివాలయ ప్రారంభోత్సవంపై
ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలను
వేసి అలంకరణ చేసేందుకు అతిపెద్ద క్రేన్ వాడాలన్నారని అధికారులకు సూచించారు.
విగ్రహం ప్రారంభోత్సవం సందర్భంగా బౌద్ధ భిక్షువులను ఆహ్వానించి సాంప్రదాయ
పద్ధతిలో వారికి మర్యాదలు చేయాలని సీఎం వివరించారు.
ప్రతి నియోజకవర్గం నుంచి 300 మందిని సభకు ఆహ్వానించాలని, విగ్రహావిష్కరణ సభకు
35,700 మంది హాజరయ్యేలా చూడాలని పేర్కొన్నారు. ప్రజల తరలింపు కోసం 750 ఆర్టీసీ
బస్సులు బుక్ చేయాలని చెప్పారు. సభకు అంబేడ్కర్ ముని మనుమడు ప్రకాశ్‌ను
ఆహ్వానించాలని కేసీఆర్ నిర్ణయించారు. మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్,
ప్రశాంత్ రెడ్డిలతో కూడిన కమిటీ విగ్రహావిష్కరణ, సభకు సంబంధించిన ఏర్పాట్లను
పర్యవేక్షిస్తారన్నారు. అంబేడ్కర్ విగ్రహ రూపశిల్పి మహారాష్ట్రకు చెందిన
రామ్ వంజీ సుతార్‌ను ఆ రోజున పిలిపించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఘనంగా
సత్కరించాలని అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ 14న మధ్యాహ్నం 2 గంటలకు సభ
ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని తెలిపారు.
అటు ఈనెల 30న అంబేడ్కర్ తెలంగాణ సచివాలయం ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి
చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. సచివాలయ ప్రారంభానికి 2500 మంది
హాజరవుతారని అంచనా వేశారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు
సచివాలయాన్ని సందర్శించే అవకాశం కల్పిస్తామని చెప్పారు. గృహలక్ష్మి పథకం
విధివిధానాలు రూపొందించాలని సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు. త్వరలో
పోడుభూముల పట్టాల పంపిణీ ప్రారంభించాలని సూచించారు. గొర్రెల పంపిణీని సత్వరమే
ప్రారంభించాలని ఆదేశించారు. ఆ రోజు ఉదయం మంత్రి ప్రశాంత్‌రెడ్డి
శాస్త్రోక్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తే ముందు ఛాంబర్లో సీఎం కేసీఆర్
ఆశీనులు కానున్నారు.
మేధావులు ధన్యవాద సభ ఏర్పాటు: రాష్ట్ర సచివాలయానికి అంబేడ్కర్ పేరు
పెట్టినందుకు, అంబేడ్కర్ భారీ విగ్రహం ఏర్పాటు చేసినందుకు గానూ మేధావులు
ధన్యవాదాల సభను హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా
యూజీసీ మాజీ ఛైర్మన్ సుఖ్‌దేవ్ థోరట్ హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వానికి
ధన్యవాదాలు తెలిపారు. ఈ సభలో ఉన్నతాధికారులు, పలువురు విశ్రాంత అధికారులు,
మేధావులు, ఉపకులపతులు పాల్గొన్నారు.