సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్థాన్ సత్తా చాటింది. దక్షిణాఫ్రికా)తో జరిగిన మ్యాచ్‌లో 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. పాకిస్థాన్ నిర్దేశించిన 186 పరుగుల విజయ లక్ష్యంతో దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ప్రారంభించింది. ఈ క్రమంలో 9 ఓవర్ల వద్ద మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించాడు. అప్పటికి దక్షిణాఫ్రికా నాలుగు వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది. ఆ తర్వాత వర్షం తగ్గుముఖం పట్టడంతో మ్యాచ్‌ను 14 ఓవర్లకు కుదించి దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని 142 పరుగులుగా నిర్దేశించారు. అయితే, చేయాల్సిన పరుగుల కంటే బంతులు తక్కువగా ఉండడంతో సఫారీ బ్యాటర్లపై ఒత్తిడి పెరిగింది. దీంతో వేగంగా పరుగులు సాధించే క్రమంలో వికెట్లు పారేసుకున్న సౌతాఫ్రికా ఓటమి పాలైంది.
మ్యాచ్ తిరిగి ప్రారంభమయ్యాక ఐదు ఓవర్లలో సౌతాఫ్రికా ఐదు వికెట్లు కోల్పోయింది. మొత్తంగా 14 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 108 పరుగులకు మాత్రమే పరిమితమైంది. సఫారీ బ్యాటర్లలో కెప్టెన్ తెంబా బవుమా 36 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మార్కరమ్ 20, క్లాసెన్ 15, స్టబ్స్ 18 పరుగులు చేశాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ఇఫ్తికార్ అహ్మద్ (51), షాదాబ్ ఖాన్ (52) అర్ధ సెంచరీలతో రాణించారు. మహమ్మద్ హరీస్, నవాజ్ చెరో 28 పరుగులు చేశారు. మిగతా వారిలో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. దక్షిణాఫ్రికా బౌలర్లలో అన్రిక్ నోకియా 4 వికెట్లు పడగొట్టాడు. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన షాదాబ్ఖాన్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో పాకిస్థాన్ 4 పాయింట్లతో మూడో స్థానానికి ఎగబాకింది. సౌతాప్రికా 5 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా, ఆరు పాయింట్లతో ఇండియా అగ్రస్థానంలో ఉంది. ఆదివారం భారత్ జట్టు జింబాబ్వేతో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే నేరుగా సెమీస్‌కు చేరుకుంటుంది.