ఫ్రెంచ్ ఓపెన్‌లో సాత్విక్ సాయిరాజ్ జోడీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన సెమీస్‌లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ షెట్టి జంట 21-18, 21-14తో కొరియాకు చెందిన చొయి సోల్ గ్యూ-కిమ్ వోన్ హోపై వరుస గేముల్లో గెలిచింది. 45 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌లో భారత జోడీ అద్భుత ప్రదర్శన చేసింది. తొలి గేమ్‌లో 7-7తో సమంగా నిలిచినా.. వరుసగా ఏడు పాయింట్లు సాధించిన సాత్విక్ జంట 11-7తో బ్రేక్‌కు వెళ్లింది. అయితే, తిరిగి వచ్చిన తర్వాత ప్రతిఘటించిన కొరియా జంట 16-13తో పైచేయి సాధించింది. కానీ, చిరాగ్ కొన్ని పదునైన స్మాష్‌లతో వడివడిగా పాయింట్లు సాధించడంతో భారత్ 19-18తో నిలిచింది. అయితే, చొయి అనవసర తప్పిదాలతో గేమ్ సాత్విక్ జోడీ సొంతమైంది. ఇక, రెండో గేమ్‌లో 7-4తో ముందంజ వేసిన భారత్ జంట.. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకొంది.