టీమిండియా పరుగుల వీరుడు, మాజీ సారథి విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డును తన పేర రాసుకున్నాడు. టీ20 ప్రపంచకప్ లో 1000 పరుగులు సాధించిన రెండో క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 12 పరుగులు మాత్రమే చేసిన కోహ్లీ ఈ ఘనత అందుకున్నాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్ సందర్భంగా క్రిస్ గేల్ రికార్డును బద్దలుగొట్టిన 33 ఏళ్ల కోహ్లీ.. శ్రీలంక లెజెండ్ మహేల జయవర్థనె అత్యధిక పరుగుల రికార్డుకు 28 పరుగుల దూరంలో నిలిచాడు. జయవర్ధనె 31 మ్యాచుల్లో 1016 పరుగులు చేశాడు. కోహ్లీ 24వ మ్యాచ్ (22వ ఇన్నింగ్స్)లోనే 1000 పరుగుల మైలు రాయిని చేరుకోవడం విశేషం.
అయితే, ఈ మ్యాచ్‌లో 12 పరుగులు మాత్రమే చేసిన కోహ్లీ టీ20 ప్రపంచకప్‌లో రెండో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. కాగా, టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక అర్ధ సెంచరీలు సాధించిన రికార్డు ఇప్పటికే కోహ్లీ పేరున ఉంది. అలాగే, అంతర్జాతీయ టీ20ల్లోనూ అత్యధిక పరుగులు సాధించిన రికార్డు కూడా కోహ్లీ సొంతం. అంతర్జాతీయ టీ20ల్లో కోహ్లీ 3,868 పరుగులు సాధించాడు. ఆ తర్వాతి స్థానంలో రోహిత్ శర్మ అన్నాడు. దీంతోపాటు టీ20 ప్రపంచకప్‌లో 12, అంతర్జాతీయ టీ20ల్లో 36 అర్ధ సెంచరీలు సాధించాడు.