– ఉమెన్స్ టీ20 ప్రపంచ కప్
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్‌లో తమకు ఎదురులేదని ఆస్ట్రేలియా మరోసారి
నిరూపించింది. రికార్డుస్థాయిలో పొట్టి విశ్వకప్‌ను ఆరోసారి ముద్దాడింది. టీ20
వరల్డ్ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను 19 పరుగుల తేడాతో ఓడించింది. ముందుగా
బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 156 పరుగులు
చేసింది. అనంతరం సఫారీ జట్టు 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 137 రన్స్
మాత్రమే చేసింది. ఆసీస్ తరుఫున ఓపెనర్ బెత్ మూనీ (74 నాటౌట్) అద్భుతమైన
ఇన్నింగ్స్ ఆడింది. మహిళల టీ20 వరల్డ్‌ను గెలుచుకున్న కంగారూ జట్టుకు
ట్రోఫీతోపాటు ప్రైజ్ మనీగా రూ. 8.27 కోట్లు అందించారు. ఆస్ట్రేలియా జట్టు టీ20
ప్రపంచ కప్‌ను రికార్డు స్థాయిలో ఆరోసారి కైవసం చేసుకుంది.
అంతకుముందు 2010, 2012, 2014, 2018, 2020 సంవత్సరాల్లో ఆ జట్టు పొట్టి కప్‌ను
ఎగరేసుకుపోయింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకుంది.
ఓపెనర్ బెత్ మూనీ ఫైనల్ మ్యాచ్‌లో సూపర్ హాఫ్ సెంచరీతో చెలరేగింది. 53
బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్‌తో అజేయంగా 74 పరుగులు చేసింది. మిగిలిన
బ్యాట్స్‌వుమెన్ తలో చేయి వేయడంతో 20 ఓవర్లలో 156 పరుగులు చేసింది.
దక్షిణాఫ్రికా తరఫున షబ్నమ్ ఇస్మాయిల్, మరిజన్ కాప్ తలో రెండు వికెట్లు
తీశారు. అనంతరం సఫారీ జట్టు 20 ఓవర్లలో 137 రన్స్ వద్ద ఆగిపోయింది. ఓపెనర్
లారా వోల్వార్డ్ 61 (48 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగులు చేయగా..
మిగిలిన వారు విఫలమయ్యారు. బెత్ మూనీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కగా..
గాడ్నర్కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కింది.