న్యూజిలాండ్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భారత్.. టీ20ల్లో 2-1తో సిరీస్ ను
పట్టేసింది. బుధవారం జరిగిన నిర్ణయాత్మక మూడో మ్యాచ్‌లో భారత్ 168 పరుగుల
తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4
వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (63
బంతుల్లో 126 నాటౌట్; 12 ఫోర్లు, 7 సిక్సర్లు) అజేయ సెంచరీతో కదం తొక్కాడు.
ఇటీవల హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో డబుల్ సెంచరీ బాదిన
ఈ ఓపెనర్ అహ్మదాబాద్‌లో కివీస్ బౌలర్లను ఊచకోత కోశాడు. తద్వారా మూడు
ఫార్మాట్ల (టెస్టు, వన్డే, టీ20)లో అంతర్జాతీయ శతకం నమోదు చేసుకున్న ఐదో భారత
ఆటగాడిగా, పిన్న వయస్కుడిగా రికార్డుల్లోకెక్కాడు. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్
(1) విఫలం కాగా.. వన్‌డౌన్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి (22 బంతుల్లో 44; 4
ఫోర్లు, 3 సిక్సర్లు) దంచికొట్టాడు.
సూర్యకుమార్ యాదవ్ (13 బంతుల్లో 24; ఒక ఫోర్, 2 సిక్సర్లు), కెప్టెన్
హార్దిక్ పాండ్యా (17 బంతుల్లో 30; 4 ఫోర్లు, ఒక సిక్సర్) కూడా రాణించడంతో
భారత్ భారీ స్కోరు చేయగలిగింది. కివీస్ బౌలర్లలో బ్రాస్‌వెల్, టిక్నర్,
సోధి, మిషెల్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్యఛేదనలో
న్యూజిలాండ్ ఏమాత్రం పోరాడలేకపోయింది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన ఆ
జట్టు 12.1 ఓవర్లలో 66 పరుగులకే కుప్పకూలింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో కనీస
ప్రతిఘటన కనబరచిన కివీస్ ఈ మ్యాచ్‌లో పూర్తిగా విఫలమై ఉత్తచేతులతో ఇంటిబాట
పట్టింది. డారిల్ మిషెల్ (35), కెప్టెన్ శాంట్నర్ (13) మినహా మరే ఆటగాడు
రెండంకెల స్కోరు చేయలేకపోయాడు. మన బౌలర్లలో హార్దిక్ 4, అర్ష్‌దీప్,
ఉమ్రాన్, శివమ్ మావి తలా రెండు వికెట్లు పడగొట్టారు. కెరీర్లో తొలి టీ20
శతకం నమోదు చేసుకున్న గిల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ , పాండ్యాకు ‘మ్యాన్
ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి.