రూ.1300 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభాలు
ఇంఫాల్ : మణిపుర్‌లోని బీజేపీ ప్రభుత్వం ఆ రాష్ట్రానికి తీవ్రవాదం, బంద్‌ల
నుంచి విముక్తి కల్పించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. అలాగే
రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించిందని వెల్లడించారు. బిష్ణుపుర్ జిల్లా
మొయిరాంగ్‌లో జరిగిన ఓ ర్యాలీనుద్దేశించి ఆయన ప్రసంగించారు. అంతకుముందు
రూ.1300 కోట్ల విలువైన 21 ప్రాజెక్టులకు వర్చువల్‌గా ప్రారంభాలు, శంకుస్థాపనలు
చేశారు. అలాగే ఇంఫాల్‌లోని మర్జింగ్ పోలో కాంప్లెక్స్‌లో గుర్రపు స్వారీ
చేస్తున్నట్లున్న 120 అడుగుల ఎతైన పోలో ఆటగాడి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
పోలో ఆటకు మణిపుర్‌ను జన్మస్థలంగా భావిస్తారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం
తీవ్రవాదుల చొరబాటును నిరోధించిందని, ఆరు జిల్లాల్లో సైనిక దళాల
ప్రత్యేకాధికారాల చట్టాన్ని తొలగించామని అమిత్ షా వివరించారు. భాజపా
నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎనిమిదేళ్ల కాలంలో ఈశాన్య రాష్ట్రాల్లో రూ.3.45
లక్షల కోట్లను పెట్టుబడిగా పెట్టిందన్నారు. ప్రధాని మోదీ 51సార్లు ఈ
ప్రాంతాన్ని సందర్శించారని తెలిపారు. రోడ్డు, రైలు, వాయు మార్గాల్లో అనుసంధానత
అనేక రెట్లు పెరిగిందని చెప్పారు. కాంగ్రెస్ తీసుకొచ్చిన లుక్ ఈస్ట్
పాలసీని యాక్ట్ ఈస్ట్ పాలసీగా మార్చామని చెప్పారు. ఈశాన్యానికి చెందిన
ఎనిమిది రాష్ట్రాలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడమే కేంద్రం లక్ష్యమని షా
వివరించారు.
మోయిరాంగ్‌లోని ఇండియన్ నేషనల్ ఆర్మీ (ఐఎన్ఏ) ప్రధాన కార్యాలయాన్ని అమిత్
షా సందర్శించారు. నేతాజీ సుభాష్ చంద్ర బోస్ స్మారకం వద్ద ఆయన చిత్రపటానికి
పుష్పాంజలి ఘటించారు. * నాగాలాండ్‌లోని 42 పాఠశాలల్లో 42 వీఆర్ ప్రయోగశాలలు,
కోహిమా జిల్లా చీఫోబోజౌలో విద్యుత్ సబ్‌స్టేషన్, డొయాంగ్ నదిపై నిర్మించిన
రెండు వరుసల వంతెనను అమిత్ షా వర్చువల్ విధానంలో ప్రారంభించారు. అలాగే ఈ
ఏడాది రాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పలువురు బీజేపీ నేతలతో
రాజకీయ మంతనాలు నిర్వహించారు.