బెంగళూరు : ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం గురించి ఆలోచిస్తుంటే భారతదేశం డిజిటల్
సాంకేతికత, విప్లవాత్మక విధానాలతో ఆదర్శంగా నిలిచిందని మైక్రోసాఫ్ట్ సీఈఓ
సత్యనాదెళ్ల విశ్లేషించారు. బెంగళూరులో జరుగుతున్న ఫ్యూచర్ రెడీ టెక్నాలజీ
సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆర్థిక మాంద్యాన్ని నియంత్రించేందుకు
క్రమశిక్షణతో కూడిన వ్యయం, నవ్యాలోచనలు అవసరమని, ప్రపంచ దేశాల్లో
ఆవిష్కృతమయ్యే ప్రతి సాంకేతికతనూ భారత్‌ను వేగంగా అందుకుంటోందని వెల్లడించారు.
నేడు భారత్‌లో తయారైన ఉత్పాదనలన్నీ ప్రపంచ అవసరాలు తీరుస్తున్నాయని తెలిపారు.
భారత్‌లో డేటా సెంటర్ల స్థాపనకు పెట్టుబడులు పెడుతున్నట్లు చెప్పిన సత్య
నాదెళ్ల త్వరలో నాలుగో సెంటర్‌ను ప్రారంభిస్తామని వివరించారు. ప్రపంచంలో
అత్యధిక మైక్రోసాఫ్ట్ ఉద్యోగులున్న దేశాల్లో భారత్ రెండోదని తెలిపారు.
బిర్యానీ అల్పాహారం కాదు : హైదరాబాద్ బిర్యానీ దక్షిణ భారత అల్పాహారం కాదంటూ
ఏఐ ఆధారిత సాఫ్ట్వేర్ చాట్ రోబోట్ చాట్ జీపీటీతో సంభాషించిన సందర్భంగా
సత్య నాదెళ్ల పేర్కొన్నారు. దక్షిణ భారతీయులు అమితంగా ఇష్టపడే అల్పాహారం ఏదని
చాట్ జీపీటీని ఆయన ప్రశ్నించారు. ఇడ్లీ, దోసె, వడ, బిర్యానీ ఐచ్ఛికాల్లో
బిర్యానీ అని చాట్ జీపీటీ చెప్పడంతో ఆయన ఇలా స్పందించారు.