ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
న్యూఢిల్లీ : జల సంరక్షణ చర్యల్లో ప్రభుత్వాల ప్రయత్నాలు ఒక్కటే సరిపోవనీ,
ప్రజా భాగస్వామ్యానికి దీనిలో ఎంతో ప్రాధాన్యం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర
మోడీ పేర్కొన్నారు. ఈ ఉద్యమంలో ప్రజలూ పాలు పంచుకున్నప్పుడు పనిలో తీవ్రత
గురించి వారికి మరింత బాగా తెలుస్తుందనీ, ఇది తమది అనే భావన కలుగుతుందని
చెప్పారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రెండ్రోజుల పాటు జరిగే
‘రాష్ట్రాల జలవనరుల మంత్రుల జాతీయ సదస్సు’ భోపాల్లో మొదలైంది. దీనిని
ఉద్దేశించి ఆయన వీడియో కాన్ఫరెన్స్ విధానంలో ప్రసంగించారు.
ముందస్తు ప్రణాళికలు రూపొందాలి : ‘‘జలాల పంపకం విషయంలో రాష్ట్రాల మధ్య సమన్వయం
ఉండాలి. పట్టణీకరణను దృష్టిలో పెట్టుకుని తగిన ముందస్తు ప్రణాళికల్ని
రాష్ట్రాలు రూపొందించుకోవాలి. జలవనరుల అంశం రాష్ట్రాల పరిధిలోకి వస్తుంది. దేశ
ఉమ్మడి లక్ష్యాల సాధనలో వాటి ప్రయత్నాలు ఎంతో దోహదపడతాయి. ఉపాధి హామీ పథకం
కింద కూడా జలవనరుల సంబంధిత పనులే గరిష్ఠంగా జరగాలి. పారిశ్రామిక, వ్యవసాయ
రంగాల్లో నీటి వినియోగం ఎక్కువ. జల సంరక్షణపై ఆ రంగాల్లో అవగాహనను పెంచాలి.
స్థానికంగా ఉత్సవాలు నిర్వహించాలి. వాన నీటిని ఒడిసి పట్టడానికి అవసరమైన
ప్రణాళిక వర్షాకాలానికంటే ముందే సిద్ధం చేసుకోవాలని మోడీ సూచించారు.