న్యూఢిల్లీ : డిజిటల్ రూపాంతరీకరణ ద్వారా సుస్థిర, సమ్మిళిత ఆర్థికాభివృద్ధి
సాధించడానికి భారత ప్రభుత్వం విశేష కృషిని కొనసాగిస్తోందని మైక్రోసాఫ్ట్
ఛైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల ప్రశంసించారు. ఈ లక్ష్య సాధనకు తామూ ఇతోధిక
చేయూతనందిస్తామని తెలిపారు. తద్వారా యావత్ ప్రపంచానికే భారత్ సరికొత్త
మార్గాన్ని చూపుతుందన్నారు. సత్య నాదెళ్ల ఢిల్లీలో ప్రధాని మంత్రి నరేంద్ర
మోడీతో భేటీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డిజిటల్
ఇండియా కార్యక్రమం విజయవంతానికి తమ కంపెనీ మద్దతుగా నిలుస్తుందని సత్య నాదెళ్ల
హామీ ఇచ్చారు. ప్రధాని మోడీతో తన సమావేశం లోతైన విశ్లేషణతో, చాలా అర్థవంతంగా
కొనసాగిందని తెలిపారు. అందుకుగాను కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన ట్వీట్ చేశారు.
అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి భారత ప్రభుత్వం చేస్తున్న కృషి
తనకు ప్రేరణనిస్తోందన్నారు. సత్య నాదెళ్లను కలుసుకోవడంపై ప్రధాని నరేంద్ర మోడీ
హర్షం వ్యక్తం చేశారు. ‘సాంకేతిక యుగంలో నవ్యావిష్కరణల దిశగా భారత్ వడివడిగా
అడుగులేస్తోంది. ఈ ప్రపంచమంతటినీ మార్చేయగల ఆలోచనలు మన యువత మది నిండా
తొణికిసలాడుతున్నాయంటూ ప్రధాని ట్వీట్ చేశారు. సత్య నాదెళ్ల గత మూడు రోజులుగా
మన దేశంలోని ప్రముఖ నగరాల్లో పర్యటిస్తున్నారు. స్టార్టప్ సంస్థల
నిర్వాహకులు, సాంకేతిక నిపుణులు, విద్యావంతులు, విద్యార్థులతో
భేటీ అవుతున్నారు.