ముంబయి : జైనుల పుణ్యక్షేత్రం శ్రీ సమ్మద్ శిఖరాజిని ఝార్ఖండ్ ప్రభుత్వం
పర్యాటక ప్రాంతంగా మార్చడంపై పెను దుమారం చెలరేగింది. ఈ నిర్ణయాన్ని తక్షణమే
వెనక్కి తీసుకోవాలంటూ దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో జైన మతస్థులు ఆందోళన
చేపట్టారు. ఝార్ఖండ్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ముంబయిలో భారీ నిరసన
ప్రదర్శన నిర్వహించారు. ఢిల్లీ లోని ఇండియా గేట్ వద్ద నిర్వహించిన నిరసన
ప్రదర్శనలో వేల సంఖ్యలో జైనులు పాల్గొన్నారు. ఝార్ఖండ్ ప్రభుత్వం తక్షణమే ఆ
నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలంటూ ఝార్ఖండ్ రాజధాని రాంచీలోనూ నిరసన
ప్రదర్శనలు చేశారు. సమ్మద్ శిఖరాజి తీర్థ్ను పర్యాటక ప్రాంతంగా ప్రకటించడం
వల్ల ఆ స్థలం పవిత్రత దెబ్బతింటుందని జైనులు ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘పర్యాటకం
పేరుతో మా నమ్మకాలకు భంగం కలిగించొద్దు. మేము ఎల్లప్పుడూ అహింస,
శాంతిమార్గాన్నే అనుసరిస్తాం. కానీ మాపై దాడులు చేస్తే గట్టిగానే బదులిస్తాం.
శ్రీ సమ్మద్ శిఖరాజి మాకు ఎంతో పవిత్ర ప్రదేశం. అలాంటి ప్రదేశంలోకి లక్షల
మందిని అనుమతించడం వల్ల దాని పవిత్రత దెబ్బతింటుందని జైన ఆచార్యుడు
రత్నసుందర్ సురీశ్వర్ మహారాజ్ పేర్కొన్నారు.