మైక్రోసాఫ్ట్ ఛైర్మన్, సీఈఓ సత్య నాదెళ్ల
న్యూఢిల్లీ : సమగ్రాభివృద్ధి, సాధికారత, ఆర్థికాభివృద్ధి సాధించడంలో సాంకేతికత
కీలక పాత్ర పోషిస్తోందని మైక్రోసాఫ్ట్ ఛైర్మన్, సీఈఓ సత్య నాదెళ్ల చెప్పారు.
భారత్లో పెట్టుబడులకు మైక్రోసాఫ్ట్ కట్టుబడి ఉందని ఇక్కడ జరిగిన ‘టెక్
ఫర్ గుడ్ అండ్ ఎడ్యుకేషన్’ ప్రదర్శనలో పేర్కొన్నారు. దాతృత్వ పనులు,
విద్యా రంగాలపై సాంకేతికత చూపిన ప్రభావాన్ని ప్రదర్శించే నిమిత్తం
మైక్రోసాఫ్ట్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో పాల్గొన్న
ఉపాధ్యాయులు, విద్యార్థులు, వృత్తి నిపుణులతో సత్య నాదెళ్ల ముచ్చటించారు.
సమగ్రాభివృద్ధికి సాయం : ‘‘మీరంతా చేసిన కృషి స్ఫూర్తిమంతమైనది. మా ప్రణాళికలు
చర్యల రూపంలో చూడడం అన్నది నాకిష్టమైన పనుల్లో ఒకటి. సాంకేతికత, ఆర్థిక
వృద్ధికి ముగింపు ఉండకూడదు. మనం ఏం కోరుకుంటున్నామో అన్నీ జరిగేలా చూసుకోవాలి.
సామాజిక సమగ్రాభివృద్ధి దిశగా మీరంతా ఆలోచించాలి. ప్రతి ఒక్కరూ ఆర్థికంగా
వృద్ధి చెందితేనే, సమగ్రాభివృద్ధి జరిగినట్లు నేను భావిస్తాను. సాంకేతికత వల్ల
జన సమూహాల్లో మార్పు కనిపించాలి. అందుకు సహాయం చేయడానికి మా కంపెనీ
సహాయపడుతుంది.
సమాజంలో మార్పే లక్ష్యం : భారత్లో పెట్టుబడులకు మైక్రోసాఫ్ట్ కట్టుబడి ఉంది.
భారత్లో తయారీ కోసం పెట్టుబడులు పెడుతూనే ఉన్నాం. మాకు భారీగా మానవ వనరులున్న
దేశం ఇదే. ఇక్కడ మా డేటా సెంటర్లు న్నాయి. మేం అన్ని అప్లికేషన్లలో వాడే
కృత్రిమ మేధ (ఏఐ) సామర్థ్యాల్లో కొన్ని ‘మేడ్ ఇన్ ఇండియా’వే ఉన్నాయి. మా
సాంకేతికతతో భారత్ ఏం తయారు చేస్తుందన్నదే ప్రశ్న. సమాజంలో మార్పు అనేది ఏ
ఒక్క సంస్థో, ఏ ఒక్క వ్యక్తో తీసుకురాలేరు. అది బృంద స్ఫూర్తితో సాధ్యం. ప్రతి
ఒక్కరు, ప్రతి సంస్థలో సాధికారత తీసుకురావడంలో సాంకేతికత కీలక పాత్ర
పోషిస్తుందన్నది మాత్రం సత్యం. అందరు ప్రజలూ ఇందులో భాగస్వాములవ్వాలి. తమ
నైపుణ్యాలను, సాంకేతికతలను, సామర్థ్యాన్ని వినియోగించి సమాజంలో మార్పు
తీసుకురావాలి’’ అని సత్యనాదెళ్ల అన్నారు.