న్యూఢిల్లీ : పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31న ప్రారంభమవుతాయని
అధికారిక వర్గాల సమాచారం. తొలిరోజు ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ
ముర్ము ప్రారంభోపన్యాసం చేయనున్నారు. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా
సీతారామన్ 2023-24 బడ్జెట్ ప్రవేశపెడతారు. బడ్జెట్ భేటీలు రెండు విడతలుగా
ఏప్రిల్ 6 వరకు కొనసాగుతాయి. తొలి విడతలో జనవరి 31 నుంచి ఫిబ్రవరి 10 వరకు,
రెండో విడతలో మార్చి 6న తిరిగి ప్రారంభమై ఏప్రిల్ 6న ముగియనున్నట్లు
తెలిసింది. బడ్జెట్ సమావేశాల తొలి రోజునే ఆర్థిక సర్వే నివేదికను ఉభయ సభల్లో
ప్రవేశపెడతారని అధికారులు తెలిపారు. తొలి విడతలో రాష్ట్రపతి ప్రసంగానికి
ధన్యవాదాలు తెలుపుతూ చేసే తీర్మానంపై చర్చించనున్నారు. కేంద్ర బడ్జెట్‌పై
చర్చకు ఆర్థిక మంత్రి సమాధానం ఇస్తారు. రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో వివిధ
మంత్రిత్వ శాఖలకు నిధుల కేటాయింపులపై చర్చించడం, బడ్జెట్‌కు ఆమోదం తెలపడం
వంటివి చేపడతారు.