యువశాస్త్రవేత్తలకు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు
నాగ్‌పుర్‌లో 108వ సైన్స్ కాంగ్రెస్ ప్రారంభం
నాగ్‌పుర్ : శాస్త్రవేత్తలు దేశాన్ని స్వయం సమృద్ధం చేయాలని, ప్రజల రోజువారీ
జీవితంలో మార్పులు తేవడంపై దృష్టి సారించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
సూచించారు. 108వ భారత సైన్స్ కాంగ్రెస్‌ను ఆయన ఢిల్లీ నుంచి వీడియో సమావేశం
విధానంలో ప్రారంభించారు. శాస్త్రీయ పద్ధతులను బలోపేతం చేయాలని, క్వాంటమ్
టెక్నాలజీలు, డేటా సైన్స్, కొత్త టీకాల అభివృద్ధి, కొత్త వ్యాధులను
గుర్తించడం లాంటి వాటిపై దృష్టి పెట్టడంతో పాటు యువతరాన్ని పరిశోధనల దిశగా
ప్రోత్సహించాలని తెలిపారు. అయిదు రోజుల పాటు కొనసాగే భారత సైన్స్
కాంగ్రెస్‌ను రాష్ట్రసంత్ తుక్డోజీ మహారాజ్ నాగ్‌పుర్ విశ్వవిద్యాలయంలో
ప్రధాని ప్రారంభించారు. పరిశోధనలు ప్రయోగశాల నుంచి బయటికొచ్చి నేలమీద
కనపడాలని, వాటి ప్రభావం అంతర్జాతీయ స్థాయి నుంచి క్షేత్రస్థాయికి వచ్చినప్పుడే
ఆ ప్రయత్నాలు గొప్ప లక్ష్యాలు సాధించినట్లు అవుతుందని ఈ సందర్భంగా ఆయన
అన్నారు. భారతదేశం ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్లు, రసాయన శాస్త్రం,
కమ్యూనికేషన్లు, సెన్సర్లు, క్రిప్టోగ్రఫీ వైపు వేగంగా వెళ్తోందని, యువ
శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఈ రంగంలో నైపుణ్యం సాధించి ఎదగాలని నరేంద్ర
మోడీ ఆకాంక్షించారు.