రూ.43.08 కోట్ల అంచనాతో నిర్మించిన టూరిజం ఫెసిలిటేషన్ సెంటర్‌ను రాష్ట్రపతి
ద్రౌపది ముర్ము సోమవారం ప్రారంభించారు. మల్లికార్జున స్వామి, బ్రమరాంబిక
అమ్మవారి ఆలయాలను దర్శించుకున్న అనంతరం ఆమె టూరిజం ఫెసిలిటేషన్ సెంటర్‌ను
ప్రారంభించారు.
హాటకేశ్వరం, శిఖరేశ్వరంలో ప్రసాద్ స్కీమ్ ఎమినిటీ సెంటర్లలో భాగంగా
పుష్కరిణి పునరుద్ధరణ, బస్టాండ్ నుంచి పాతాళగంగ వైపు రోడ్డు, సౌండ్ అండ్ లైట్
షో, ఫుడ్ కోర్ట్, డిజిటల్ ఇంటర్వెన్షన్, పార్కింగ్ స్కీమ్, ఇతర సౌకర్యాలు
ప్రాజెక్టులో భాగంగా ఉన్నాయి.
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి, భారత పర్యాటక శాఖ
కార్యదర్శి అరవింద్‌సింగ్, ఏపీ టూరిజం ఎండీ, సీఈవో కన్నబాబు దేశంలోని అన్ని
ప్రాంతాల్లో కేంద్రం అమలు చేస్తున్న ప్రసాద్ పథకం గురించి, శ్రీశైలంలో అమలు
చేస్తున్న తీరు గురించి వివరించారు.
రాష్ట్రపతి పర్యటనలో భాగంగా శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో పోలీసులు
గ్రేహౌండ్ బృందాలతో కూంబింగ్‌ను ముమ్మరం చేశారు. తెలంగాణ, ఏపీ పోలీసులు
బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రపతికి
స్వాగతం పలకాల్సి వున్నా, ఆయన డిసెంబర్ 28న ఢిల్లీకి వెళ్లాల్సి ఉన్నందున
రాష్ట్రపతికి ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి తరపున రాష్ట్ర మంత్రులు హాజరయ్యారని
సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఆలయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శనాన్ని దృష్టిలో ఉంచుకుని,
శ్రీశైలం దేవస్థానం అధికారులు సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకు భక్తులకు దర్శనం
నిలిపివేశారు. ఆలయంలో రాష్ట్రపతి దర్శనం తర్వాత భక్తులకు దర్శనం, ఇతర సేవలను
పునఃప్రారంభించారు.
రాష్ట్రపతి సాయంత్రం 4 గంటలకు సున్నిపెంట హెలిప్యాడ్‌కు చేరుకున్నారు,
అక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్
రెడ్డి, ఆర్కే రోజా, ఇతర నాయకులు, అధికారులు రాష్ట్రపతికి, టీఎస్ గవర్నర్‌కు
వీడ్కోలు పలికారు.