న్యూఢిల్లీ : మన దేశంలో ప్రస్తుతం కరోనా అదుపులోనే ఉన్నందున అంతర్జాతీయ
విమానాలపై ఆంక్షలు విధించడం, లాక్‌డౌన్‌ను అమలుపరచడం వంటివి అవసరం లేదని
నిపుణులు అభిప్రాయపడ్డారు. అలాగని ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరించడం, ప్రజలు
నిర్లక్ష్యం వహించడం శ్రేయస్కరం కాదనీ స్పష్టం చేశారు. కొన్ని దేశాల్లో
కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మహమ్మారి కట్టడికి నిఘాను, పర్యవేక్షణను
పటిష్ఠం చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. టీకాలు వేసుకోవడంతో పాటు
సహజసిద్ధమైన వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉన్న(హైబ్రిడ్ ఇమ్యూనిటీ) కారణంగా
భారతీయుల్లో వ్యాధి లక్షణాలు తీవ్రమయ్యే అవకాశాలు గానీ, ఆస్పత్రుల్లో చేరే
పరిస్థితులు గానీ ఉండబోవని అభిప్రాయపడ్డారు. మొత్తానికి మన దేశంలో పరిస్థితులు
మెరుగ్గానే ఉన్నాయని, కరోనా కేసులు పెరగకపోవడం ఆశావహ పరిణామమని ఎయిమ్స్ మాజీ
డైరెక్టర్ డా.రణ్‌దీప్ గులేరియా అన్నారు. ‘‘విమానాల రాకపోకలను నిషేధించడం
వ్యాధి నివారణకు పరిష్కార మార్గం కాదని గత అనుభవాలు స్పష్టం చేస్తున్నాయి.
చైనాలో ఉద్ధృతంగా వ్యాపిస్తున్న బి.ఎఫ్-7 ఉపవేరియంట్ భారత్‌లో ఇప్పటికే
ఉన్నా అక్కడంత ప్రభావంచూపడం లేదు’’ అని వివరించారు. చైనా, మరికొన్ని దేశాల్లో
కొవిడ్ కేసులు పెరుగుతున్న కారణంగా భారత్‌లోనూ తగు జాగ్రత్తలు పాటించాలని
పల్మనరీ విభాగం ప్రొఫెసర్ డా.నీరజ్ గుప్తా సూచించారు. సమీప భవిష్యత్తులో
లాక్డౌన్ విధించాల్సి అవసరం ఉండదన్నారు. స్వచ్ఛందంగా తగిన జాగ్రత్తలు
తీసుకోవడం, ముందస్తుగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం, సకాలంలో టీకాలు
వేసుకోవడం మన దేశ ప్రజలకు కలిసొచ్చే పరిణామమని పేర్కొన్నారు. ప్రయాణాలపై
ఆంక్షలు విధించినంత మాత్రాన వైరస్ వ్యాపించకుండా ఉండదని, ఇప్పటికే కొత్త
వేరియంట్ భారత్‌లోకి ప్రవేశించిన విషయాన్ని మరిచిపోవద్దని మరో వైద్య నిపుణుడు
డా.చంద్రకాంత్ లహేరియా అన్నారు. కరోనా నియంత్రణలో ప్రభుత్వాలు ఉదాసీనంగా
వ్యవహరించడం ఎంతమాత్రం మంచిదికాదని, వైరస్ వ్యాప్తి చెందకుండా కఠిన
నియమావళిని అనుసరించాల్సిందేనని నొక్కి చెప్పారు. చైనా అమలు చేసిన జీరో
కొవిడ్ వ్యూహం వల్ల అక్కడి ప్రజలు సహజ నిరోధకతను పొందలేకపోయారని తెలిపారు.