బసవరాజ శివలింగప్ప హొరట్టి బాధ్యతలు చేపట్టారు. పరిషత్తు అధ్యక్ష స్థానానికి
ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. నాలుగు దశకాలుగా
వరుసగా ఎమ్మెల్సీగా ఎన్నికవుతూ వస్తున్న హొరట్టి 2018 జూన్-డిసెంబరు వరకు
మొదటి సారి, 2021 ఫిబ్రవరి నుంచి 2022 మే వరకు రెండో సారి అధ్యక్షునిగా
సేవలందించారు. మూడోసారి అధ్యక్షునిగా తాజాగా బాధ్యతలు చేపట్టారు. పరిషత్తు
సమావేశాలు ప్రారంభమైన తర్వాత ఎన్నిక ప్రక్రియను ప్రారంభించేందుకు తాత్కాలిక
సభాధ్యక్షుడు రఘునాథ మల్కాపుర అవకాశాన్ని కల్పించారు. బీజేపీ సభ్యులు
వై.ఎ.నారాయణ స్వామి, తేజస్విని గౌడ, శాంతారామ్ బుడ్న సిద్ధి, ఎ.దేవేగౌడ
కదలివచ్చి హొరట్టి పేరు సూచించగా.. ఆయనూరు మంజునాథ్, ఎస్.వి.సంకనూరు,
ప్రదీప్ శెట్టర్ దాన్ని ఆమోదించారు. పూర్తి ఏకగ్రీవంగా బసవరాజ హొరట్టి
సభాధ్యక్షునిగా ఎన్నికయ్యారని మల్కాపుర ప్రకటించారు.
‘ముఖ్యమంత్రిగా ఎవరు ఉన్నా ఏ పార్టీ అధికారంలో ఉన్నా పని ఎలా చేయాలనే కళను
హొరట్టి నుంచి నేర్చుకోవాలని ముఖ్యమంత్రి బొమ్మై పేర్కొన్నారు. నూతన
అధ్యక్షునికి అభినందనలు తెలిపి, ఎగువ సభలో మాట్లాడారు. ఆయన అనుభవం, పనితీరుకు
అనుగుణంగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని తెలిపారు. ఉపాధ్యాయునిగా వృత్తి
జీవితాన్ని ప్రారంభించి, విద్యాశాఖ మంత్రిగా, మూడోసారి పరిషత్తు అధ్యక్షునిగా
సేవలందించడం సాధారణ విషయం కాదన్నారు. హుబ్బళ్లిలో న్యాయ విశ్వ విద్యాలయం,
ధార్వాడకు విజ్ఞాన నగరిగా పేరు రావడం వెనుక హొరట్టి శ్రమ ఉందన్నారు. ఇప్పటికే
42 ఏళ్లు ఎమ్మెల్సీగా సేవలు అందించిన ఆయన ఈసారి ఆరేళ్ల అవధితో కలుపుకొని
మొత్తం 48 ఏళ్లు సేవలు అందించనున్న నాయకునిగా ప్రత్యేక రికార్డు సొంతం
చేసుకుంటున్నారని ప్రశంసించారు.
యడహళ్లి గ్రామం నుంచి : బాగలకోట జిల్లా ముధోళ తాలూకా యడహళ్లి గ్రామానికి
చెందిన హొరట్టి తన డిగ్రీని ముధోళ కాడుసిద్ధేశ్వర కళాశాలలో పూర్తి చేశారు.
బెంగళూరు విశ్వవిద్యాలయం నుంచి నుంచి పీజీ పట్టాను అందుకున్నారు. హుబ్బళ్లి
ల్యామింగ్టన్ ప్రాథమికోన్నత పాఠశాలలో 1975-1980 వరకు ఉపాధ్యాయునిగా సేవ
చేశారు. మొదటి సారి 1980లో ఎమ్మెల్సీగా నెగ్గారు. ఆ తర్వాత 1986, 1992, 1998,
2004, 2010, 2016, 2022లలో వరుసగా నెగ్గి రికార్డు సృష్టించారు. కాంగ్రెస్,
జనతాదళ్ మొదటిసారిగా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు 2004లో
సైన్స్, టెక్నాలజీ, చిన్న పొదుపు మొత్తాలు, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్
శాఖ మంత్రిగా పనిచేశారు. దళ్, భాజపా నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం 2006లో
ఏర్పడినప్పుడు ప్రాథమిక విద్య, న్యాయ, పార్లమెంటరీ శాఖల మంత్రిగా బాధ్యతలు
తలకెత్తుకున్నారు.