కర్ణాటకపై ప్రభావం..పార్టీల భిన్న స్వరం
గుజరాత్ నమూనా ఆచరణ సాధ్యమేనా?
బెంగళూరు : గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలోని జాతీయ
పార్టీల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. ఈ రెండు రాష్ట్రాల్లో జాతీయ పార్టీలు
చెరొక చోట అధికారాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు త్వరలో
కర్ణాటకలో నిర్వహించే ఎన్నికలపై ఏమేరకు ప్రభావాన్ని చూపుతాయో తెలియాలంటే మరో
ఐదు నెలలు ఆగాల్సిందే. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ఈ ఫలితాల ప్రభావంపై
భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. రెండు జాతీయ పార్టీలు, ఒక ప్రాంతీయ పార్టీ
జేడీఎస్, జాతీయ స్థాయిలో ఇప్పుడిప్పుడే ఉనికిని చాటుతున్న ఆమ్ఆద్మీ పార్టీలు
ఈ ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకుని కర్ణాటక ఎన్నికల కోసం ప్రణాళికలు సిద్ధం
చేసుకుంటున్నాయి.
గుజరాత్ నమూనా ఆచరణ సాధ్యమేనా? : గుజరాత్లో బీజేపీ సాధించిన చారిత్రాత్మక
విజయం రాష్ట్ర బీజేపీకి కొన్ని సంకేతాలు పంపింది. కర్ణాటకను గుజరాత్ మాదిరి
చేయాలన్న రాష్ట్ర నేతల సంకల్పం బావున్నా ఆ మాదిరి వెనుక మంత్రివర్గ సంపూర్ణ
ప్రక్షాళన ఒక హెచ్చరిక గంటలా మారింది. గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో ఏడాదికి
ముందుగానే ముఖ్యమంత్రిని మార్చిన బీజేపీ నాలుగు నెలల ముందుగా మంత్రివర్గాన్ని
దాదాపు 80 శాతం ప్రక్షాళన చేసింది. గత ఆగస్టులో 24 మంది కొత్త మంత్రులను
మంత్రివర్గంలో చేర్చుకొని ఎన్నికలకు సిద్ధమైంది. ఆ ఫలితమే తాజా ఎన్నికల్లో
సాధికారిక విజయానికి కారణమని బీజేపీ విశ్వసిస్తోంది. ఇదే ప్రక్షాళన విధానాన్ని
కర్ణాటకలోనూ అనుసరించినా అందుకు సిద్ధంగా ఉండాలని బీజేపీ కార్యవర్గం
మంత్రివర్గానికి సూచించింది. ఇప్పటికే రాష్ట్రంలోనూ మంత్రుల పనితీరుపై సమీక్ష
కొనసాగుతోంది. ఈ వారంలో ఈ సమీక్షను పార్టీ ఎన్నికల విభాగానికి పంపుతారు. ఈ
సమీక్ష ఆధారంగా మంత్రివర్గాన్ని సవరించటం ఖాయంగా కనిపిస్తోంది. గురువారం
మంత్రివర్గ సమావేశంలోనూ ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై మంత్రివర్గ
సహచరులకు సూచనప్రాయంగా చెప్పారు.
కాంగ్రెస్‌కు హెచ్చరిక గంట : జరాత్ ఎన్నికల తర్వాత బీజేపీ కేంద్ర నాయకత్వం
కర్ణాటకపై దృష్టి సారిస్తుండటంతో కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తమయ్యాయి.
గుజరాత్, దిల్లీ కార్పొరేషన్ ఎన్నికల్లో ఘోర పరాజయం, హిమాచల్ ప్రదేశ్‌లో
అత్తెసరు స్థానాలతో అధికారాన్ని అందుకున్న కాంగ్రెస్‌కు రాష్ట్రంలోనూ సవాళ్లు
వరుస కడుతున్నాయి. గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏఐసీసీ నూతన అధ్యక్షులు
మొదలు జాతీయ నాయకత్వం అంతగా దృష్టి సారించలేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఇదే తరహా నిర్లక్ష్యం కర్ణాటకలో చూపినా పార్టీ ఎదురీదక తప్పదు. జాతీయ స్థాయిలో
నాయకత్వ లోపానికి రాష్ట్రంలో నేతల సమన్వయ సమస్య తోడైతే రానున్న ఎన్నికలు
కాంగ్రెస్‌కు పీడకలను మిగిల్చే ప్రమాదం లేకపోలేదు. గుజరాత్ విజయంతో మోదీ
నాయకత్వం పట్ల పెరిగిన విశ్వాసం ఫిరాయింపులను ప్రోత్సహించే అవకాశం ఉంది.
దిల్లీ, గుజరాత్ ఎన్నికల్లో ఒక అంకె స్థానాలకు పరిమితమైన కాంగ్రెస్‌లో నేతలకు
భవిష్యత్తుపై విశ్వాసాన్ని పెంచటం అధిష్ఠానానికి, రాష్ట్ర నాయకత్వానికి
సవాలుతో కూడిన వ్యవహారం.
జేడీఎస్‌కు వీడని భయం : ఉత్తరాది ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో ప్రభావం చూపవని
ధీమాగా ఉన్న జేడీఎస్‌కు గుజరాత్ ఎన్నికల ఫలితాల పట్టింపు లేకపోవచ్చు. మోడీ
నాయకత్వంపై పెరుగుతున్న విశ్వాసాన్ని తక్కువ అంచనా వేయకూడని పార్టీ
భావిస్తోంది. పట్టున్న పాత మైసూరు, బెంగళూరు గ్రామీణ, తుమకూరు, కోలారల్లోనూ
భాజపా అధిష్ఠానం ప్రత్యేకంగా దృష్టి సారించింది. బీజేపీ ఇటీవలి కాలంలో
సాధిస్తున్న విజయాలు ఆయా రాష్ట్రాల ప్రతిపక్ష, ప్రాంతీయ పార్టీల ఉనికిని
ప్రశ్నించేలా చేస్తున్నాయి. గుజరాత్‌లోనూ 2017 ఎన్నికల్లో 99 స్థానాలు మాత్రమే
గెలుచుకున్న బీజేపీ తాజా ఎన్నికల్లో వాటి సంఖ్యను 160కి చేర్చుకుంది. ఆ
పార్టీ పన్నిన వ్యూహం ఇతర పార్టీలన్నీ 28 స్థానాలకే పరిమితం చేసింది. పాత
మైసూరు, మధ్య కర్ణాటక, బెంగళూరు గ్రామీణ ప్రాంతంలో జేడీఎస్ మరింత పటిష్టమైన
వ్యూహాన్ని పన్నితేనే జాతీయ పార్టీల పోటీ తట్టుకోగలదు.
ఏడుసార్లు ఫలితాల స్ఫూర్తి : వరుసగా ఏడు సార్లు గుజరాత్లో అధికారాన్ని
ఏర్పాటు చేసిన బీజేపీ ఈ విజయంతో రాష్ట్రంలోనూ స్ఫూర్తి పొందేందుకు
యత్నిస్తోంది. గుజరాత్లో విపక్షానికి కనీస స్థానాలు (విపక్ష స్థానానికి
అవసరమైన) కూడా దక్కకుండా చేసిన బీజేపీ ఇదే స్థాయి విజయాన్ని రాష్ట్రంలోనూ
సాధించాలని యోచిస్తోంది. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు తలొగ్గటం, దిల్లీ
కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటమి చవిచూడటం రాష్ట్ర భాజపాకు ఆత్మావలోకనానికి
అవకాశం కల్పిస్తోంది. గుజరాత్, ఢిల్లీ మాదిరి రాష్ట్రంలో కాంగ్రెస్‌ను
లొంగదీసుకోవటం అంత సులువైన విషయం కాదని భాజపాకు తెలుసు. ఈ రెండు రాష్ట్రాల
ఫలితాల్లో భాజపాకు ఎదురైన మిశ్రమ స్పందనను సమీక్షించుకుని ఎన్నికల ప్రణాళికను
సిద్ధం చేసుకుంటోంది.
ఆప్ అమితోత్సాహం : ఇప్పటి వరకు రాష్ట్రంలో ఏ ఎన్నికల్లోనూ ఖాతా తెరవని ఆప్‌కు
దిల్లీ కార్పొరేషన్లో అధికారం, గుజరాత్లో 5 స్థానాలు సాధించటం ఊరట కలిగించే
అంశం. గత ఫిబ్రవరిలో పంజాబ్‌లో ఏకంగా ప్రభుత్వాన్నే ఏర్పాటు చేసిన ఆప్
కర్ణాటకలో ఉనికి చాటేందుకు ఉవ్విళ్లూరుతోంది. పోటీ చేసిన ప్రతి చోటా
కాంగ్రెస్ ఓట్లను, లేదా బీజేపీ వ్యతిరేక ఓట్లను రాబట్టుకునే ఆ పార్టీ వ్యూహం
రాష్ట్రంలోనూ మంచి ఫలితాలు అందిస్తోందని ఎదురుచూస్తోంది. 2023 ఎన్నికల్లో
కనీసం 100 స్థానాల్లో పోటీ చేయాలని చూస్తున్న ఆప్‌కు ఉత్తరాదిన సాధించే ప్రతి
విజయం ఓ సోపానంగా మార్చుకుంటోంది.