న్యూఢిల్లీ : ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
(ఆర్బీఐ) మరో దఫా కీలక రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు
చేసే వడ్డీ రేటు– ప్రస్తుతం 6.25 శాతం)ను సమీప కాలంలో మరో పావుశాతం
పెంచుతుందని కోటక్ మహీంద్రా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ ఉదయ్ కోటక్
అభిప్రాయపడ్డారు. దీనితో ఈ రేటు 6.5 శాతానికి పెరుగుతుందన్న అంచనాలను
వెలువరించారు. సీఐఐ గ్లోబల్ ఎకనమిక్ పాలసీ సదస్సులో ఆయన మాట్లాడుతూ కేంద్రం
నిర్దేశిస్తున్న 6 శాతం లోపు ద్రవ్యోల్బణం కట్టడికి ఆర్బీఐ అధిక ప్రాధాన్యత
ఇస్తుందని అన్నారు. తొలుత 6 శాతానికి, అటుపై నాలుగు శాతానికి ద్రవ్యోల్బణాన్ని
కట్టడి చేయడానికి కృషి చేస్తామని బుధవారం పాలసీ ప్రకటన సందర్భంగా ఆర్బీఐ
గవర్నర్ చేసిన వ్యాఖ్యలను కోటక్ ఉటంకించారు. ప్రపంచ పరిణామాలు, చమురు ధరలు
తదితర అంశాలు ద్రవ్యోల్బణం కట్టడికి ఆర్బీఐ అధిక ప్రాధాన్యత ఇస్తుందన్న
అంశాన్ని స్పష్టం చేస్తోందన్నారు. అమెరికా ఫెడ్ వడ్డీరేట్ల పెంపు సూచనలతో ఇతర
సెంట్రల్ బ్యాంకులూ ఇదే అనుసరించడానికి సిద్ధమవుతున్నాయని అన్నారు.
ద్రవ్యోల్బణం లక్ష్యంగా ఆర్బీఐ మే నుంచి రెపో రేటును ఐదు దఫాల్లో 2.25
శాతం పెంచిన సంగతి తెలిసిందే.
ఎకానమీ పురోగతికి అవకాశాలు : భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టత గురించి కోటక్
మాట్లాడుతూ దేశం సుమారు 3.2 ట్రిలియన్ డాలర్లతో ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద
ఆర్థిక వ్యవస్థగా మారిందని అన్నారు. మరింత పురోగతికి అవకాశాలు ఉన్నాయని
సూచించారు. ప్రపంచంలోని మొదటి మూడు స్థానాల్లో ఒకటిగా నిలిచేందుకు ఎన్నో
అవకాశాలు ఉన్నాయని వివరించారు. ప్రపంచ స్థాయి భారత్ కంపెనీలను అభివృద్ధి
చేసే బాటలో, అత్యాధునిక ఉత్పత్తి ఆవిష్కరణలు, మేథో హక్కుల (ఐపీ) అభివృద్ధి
సాధన, దీని ప్రాతిపదికన తయారీలో అంతర్జాతీయ స్థాయిని సాధించాల్సిన అవసరం
ఉంటుందని పేర్కొన్నారు.
విధానాల అమలు ముఖ్యం: సంజీవ్ బజాజ్
కార్యక్రమంలో బజాజ్ ఫిన్సర్వ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ బజాజ్
మాట్లాడుతూ, పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో నిరంతర పెట్టుబడులు అవసరమని
పేర్కొన్నారు. కొత్త ఉత్పాదక సామర్థ్యాలను అభివృద్ధి చేసే అంశం వాగ్దానాలకంటే
విధానాల అమలుపై ఆధారపడి ఉంటుందని అన్నారు. భారత్‌ను 40 ట్రిలియన్ డాలర్ల
ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయడానికి సంబంధించి ఆయన నాలుగు కీలక సూచనలు
చేశారు. పరిశ్రమ –వాణిజ్య విధానాల పరస్పర పురోగతికి చర్యలు, పటిష్ట
ఫైనాన్షియల్ వ్యవస్థ స్థాపన, ప్రజల సామర్థ్యాన్ని పెంపొందించడానికి విద్య,
ఆరోగ్య సంరక్షణ వ్యయాలను పెంచడం, ఉత్పత్తి ఆధారిత స్కీమ్ (పీఎల్ఐ)ను కార్మిక
ప్రభావిత రంగాలకు విస్తరించడం ద్వారా ఎకానమీలో తయారీ రంగం వాటా విస్తరణ
వీటిలో ఉన్నాయి.