ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అని చెప్పుకునే భాజపా, ఓ చిన్న పార్టీ చేతిలో
ఓటమి పాలయ్యిందని ఆమ్ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా పేర్కొన్నారు.
కేజ్రీవాల్ ఓటమికి కాషాయ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ దిల్లీ వాసులు
మాత్రం ఆమ్ఆద్మీవైపే ఉన్నారని అన్నారు. దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్
ఎన్నికల్లో సత్తా చాటిన ఆమ్ఆద్మీ పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధించింది. ఈ
నేపథ్యంలో బీజేపీ పై తీవ్ర స్థాయిలో వ్యంగ్యాస్త్రాలు విసిరింది. అపరిమిత
శక్తి, ముఖ్యమంత్రులు, దర్యాప్తు సంస్థల బలం, ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా
చెప్పుకునే భాజపా ఓ చిన్న పార్టీ చేతిలో ఓడిపోయిందని విమర్శలు గుప్పించింది.
‘పేద, నిజాయితీ కలిగిన, విద్యావంతమైన ఓ చిన్న పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద
పార్టీని ఓడించింది. బీజేపీ, ఆమ్ఆద్మీపార్టీ మధ్య జరిగిన హోరాహోరీ పోరు ఇది.
ఏడుగురు ముఖ్యమంత్రులు, 17మంది కేంద్ర మంత్రులు, 100 మంది ఎంపీలు,
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీబీఐ, ఐటీలతోపాటు జైల్లో ఉన్న ఓ వ్యక్తి
(సుకేశ్ చంద్రశేఖర్) కూడా ఎన్నికల్లో వారి ముఖ్య ప్రచారకర్తలు . అయినప్పటికీ
సామాన్యుడి చేతిలో ఓడిపోయారని ఆ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా పేర్కొన్నారు.
మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన అరవింద్
కేజ్రీవాల్ విజయాన్ని ఆపాలని బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అభివృద్ధి
కోసం పనిచేసిన వారికే ఢిల్లీ పౌరులు ప్రభుత్వ పగ్గాలు అప్పజెప్పారన్నారు.
కేజ్రీవాల్‌పై బీజేపీ చల్లుతున్న బురదను తుడిచేసిన ఢిల్లీవాసులు తాజాగా
మున్సిపల్ కార్పొరేషన్ బాధ్యతలను కూడా ఆయనకే కట్టబెట్టారని రాఘవ్ చద్దా
స్పష్టం చేశారు.
మరోవైపు, మున్సిపల్ కార్పొరేషన్లో 15 ఏళ్ల భాజపా పాలనకు అడ్డుకట్ట వేసిన
ఆమ్ఆద్మీ పార్టీ స్పష్టమైన మెజారిటీతో జయకేతనం ఎగురవేసింది. మొత్తం 250
వార్డుల్లో ఆప్ 134 స్థానాలకు కైవసం చేసుకుంది. దీంతో మేయర్ సీటు ఆమ్ ఆద్మీ
వశమైంది. ఈ ఎన్నికల్లో బీజేపీ 104 వార్డులను గెలుచుకోగా హస్తం పార్టీ కేవలం 9
స్థానాలకు పరిమితమైంది. మరో మూడు చోట్ల ఇతరులు విజయం సాధించారు.