కోల్కతా : పశ్చిమ బెంగాల్ అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టి అధినేత్రి మమతా
బెనర్జీ పాపులర్ డైలాగ్ ‘ఖేలా హోబ్’(ఆట ఆడదాం)ను తిరిగి టీఎంసీపైనే
ప్రయోగిస్తోంది బీజేపీ. వచ్చే ఎన్నికల్లో ఇరు పార్టీలు ఆట ఆడాల్సి ఉందని
పేర్కొంది. తాము అహింసను నమ్ముతామని నొక్కి చెప్పారు బీజేపీ బెంగాల్
అధ్యక్షుడు సుకంతా మజుందర్. అయితే, తమను రెచ్చగొడితే ఊరుకోబోమని
హెచ్చరించారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బర్రక్పోరాలో నిర్వహించిన బహిరంగ
సభలో ఈ మేరకు టీఎంసీపై విమర్శలు గుప్పించారు. ‘రాష్ట్ర ఆస్తులను అమ్మేస్తున్న
అధికార తృణమూల్ కాంగ్రెస్ త్వరలోనే తుడిచిపెట్టుకుపోతుందని భరోసా ఇస్తున్నా.
2024 లోక్సభ ఎన్నికలతో పాటే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా నేను
ఆశ్చర్యపోను.’ అంటూ ముందస్తు ఎన్నికలపై హించ్ ఇచ్చారు బెంగాల్ బీజేపీ
రాష్ట్ర అధ్యక్షుడు మజుందర్. 2021 అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక
ఘటనల కేసుల్లో సుమారు 300 మంది టీఎంసీ కార్యకర్తలు జైలుకు వెళ్లారని గుర్తు
చేశారు. మరింత మందిపై కేసులు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చిరించారు. చట్ట
వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారు ఏ స్థాయిలో ఉన్నా ప్రధాని నరేంద్ర మోడీ
ఉన్నంత వరకు తప్పించుకోలేరని పేర్కొన్నారు. పోలీస్ బలగాలు తటస్థంగా ఉండేలా
లోక్సభలో బిల్లు తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు.