న్యూఢిల్లీ : మాజీమంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర
గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న సీబీఐ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీం
తీర్పు వాయిదా వేసింది. ఇలాంటి వ్యవహారంలో గత తీర్పుల అంశాలు సమగ్రంగా
ఇవ్వాలని వాద, ప్రతివాదులను జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ రవికుమార్
ధర్మాసనం ఆదేశించింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎర్ర
గంగిరెడ్డే ప్రధాన నిందితుడని, సాక్ష్యాలు ధ్వంసం చేయడంలో ముఖ్య పాత్ర
పోషించారని సీబీఐ తరఫు సీనియర్ న్యాయవాది నటరాజన్ సుప్రీంకోర్టుకు
తెలియజేశారు. గంగిరెడ్డికి మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని దర్యాప్తు
సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ రవికుమార్‌ల
ధర్మాసనం విచారణ చేపట్టింది. హత్య జరిగిన తరువాత రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో
విచారణ జరిగిందని, తగిన సమయంలో ఛార్జిషీట్ దాఖలు చేయకపోవడంతో గంగిరెడ్డికి
బెయిల్ ఇచ్చినట్లు నటరాజన్ చెప్పారు. ఆ తర్వాత దర్యాప్తు సీబీఐ చేతికి
వచ్చిందన్న న్యాయవాది డీఫాల్ట్ బెయిల్ రద్దు విషయంలో గతంలో సుప్రీంకోర్టు
ఇచ్చిన తీర్పులను ప్రస్తావించారు. అన్ని తీర్పులకు సంబంధించిన సమగ్రంగా ఒక
నివేదిక తయారు చేసి ఇవ్వాలని, అదే విషయాన్ని ప్రతివాదిగా ఉన్న గంగిరెడ్డి తరపు
న్యాయవాది ఆదినారాయణరావును ఆదేశించింది. వివేకానందరెడ్డి కుమార్తె కూడా ఈ
పిటిషన్లో ప్రతివాదిగా ఉన్నారని ఆమె తరపు న్యాయవాది సిద్దార్థ దవే చెప్పగా
సునీత చెప్పాలనుకున్న విషయాలను సీబీఐకి లిఖిత పూర్వకంగా ఇవ్వాలని జస్టిస్
ఎంఆర్ షా ఆదేశించారు. తదుపరి విచారణను ఈనెల 9న వాయిదా వేసింది.