మేమే నిర్ణయం తీసుకునే పరిస్థితి తేవొద్దు
టైమ్‌లైన్‌కు కట్టుబడి ఉండాల్సిందేనని ఆదేశం
కొలీజియం సిఫార్సులపై సంప్రదింపులొద్దని వ్యాఖ్యలు
అయినా 20 సిఫార్సులను తాజాగా తిప్పిపంపిన కేంద్రం
న్యూఢిల్లీ : ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జీల నియామకం కోసం కొలీజియం చేసిన
సిఫార్సులపై కేంద్ర ప్రభుత్వం సత్వరం నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేస్తుండడం
పట్ల సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వం తీరు విసుగు
తెప్పించేలా ఉందని ఆక్షేపించింది. జడ్జీల నియామకాల ప్రక్రియకు భంగం
కలిగించవద్దని సూచించింది. జడ్జీలను నిర్దేశిత గడువులోగా నియమించాలని
ఆదేశిస్తూ సుప్రీంకోర్టు గత ఏడాది ఏప్రిల్ 20న టైమ్‌లైన్ ప్రకటించింది. ఈ
టైమ్‌లైన్‌ను కేంద్రం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ బెంగళూరు అడ్వొకేట్స్
అసోసియేషన్ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ కౌల్,
జస్టిస్ ఓజాల ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. కొలీజియం సిఫార్సు చేసిన
పేర్లపై ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఎప్పుటికప్పుడు ప్రకటించడం లేదని అటార్నీ
జనరల్ వెంకటరమణికి ధర్మాసనం తెలియజేసింది. వ్యవస్థ పనిచేసేది ఇలాగేనా అని
ప్రశ్నించింది. తమ అసహనాన్ని ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని
గుర్తుచేసింది. త్రిసభ్య ధర్మాసనం నిర్దేశించిన టైమ్‌లైన్‌కు ప్రభుత్వం
కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. కొలీజియం ఒకసారి ఒక పేరును సిఫార్సు
చేసిందంటే, అక్కడితో ఆ ఆధ్యాయం ముగిసినట్లే. వాటిపై ప్రభుత్వం మళ్లీ
సంప్రదింపులు జరిపే పరిస్థితి ఉండకూడదు’’ అని ఉద్ఘాటించింది. కొన్ని పేర్లు
ఏడాదిన్నర నుంచి పెండింగ్‌లో ఉంటున్నాయని తెలిపింది. జడ్జీలుగా పదోన్నతి
పొందాల్సిన వారు ప్రభుత్వం చేస్తున్న ఆలస్యం కారణంగా వెనక్కి తగ్గుతున్నారని
ధర్మాసనం పేర్కొంది. ‘‘ఈ కేసులో ప్రభుత్వానికి నోటీసు జారీ చేస్తున్నాం. ఈ
విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లండి’’ అని ఏజేకు సూచించింది. తాము
చట్టపరంగా నిర్ణయం తీసుకొనే పరిస్థితి తేవొద్దని కేంద్రానికి సూచించింది.
నియామకాల సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పిటిషన్‌పై
తదుపరి విచారణను డిసెంబర్ 8కి వాయిదా వేసింది.