బరిలో కేవలం 139 మంది అభ్యర్థులు
3 ప్రధాన పార్టీల నుంచి 38 మందికే అవకాశం
ఆకాశంలో సగం అంటూ గొప్పగా కీర్తించడమే తప్ప రాజకీయాల్లో మహిళలకు అవకాశాలు
కల్పించడంలో మాత్రం పార్టీలు వెనుకంజ వేస్తున్నాయి. జనాభాలో దాదాపు సగం ఉన్న
అతివలకు ఆ మేరకు చట్టసభల్లో ప్రాతినిధ్యం దక్కడం లేదు. గుజరాత్లో శాసనసభ
ఎన్నికల ముఖచిత్రం పరిశీలిస్తే నిరాశే మిగలడం ఖాయం. రాష్ట్రంలో మొత్తం 182
అసెంబ్లీ స్థానాలుండగా, మొత్తం 1,621 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో
మహిళల సంఖ్య కేవలం 139 అంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. వీరిలో ఏకంగా 56 మంది
స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తుండడం విశేషం. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో
మొత్తం 126 మంది మహిళలు పోటీకి దిగారు, 13 మంది విజయం సాధించారు. అప్పట్లో 104
మంది మహిళలు డిపాజిట్ సైతం కోల్పోయారు.
*‘ఆప్’ నుంచి ఆరుగురు : ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా మూడు
పార్టీలు పోటీ పడుతున్నాయి. ముక్కోణపు పోటీ కనిపిస్తోంది. అధికార బీజేపీ,
ప్రతిపక్ష కాంగ్రెస్‌తోపాటు ఈసారి అదృష్టం పరీక్షించుకుంటున్న ఆమ్ ఆద్మీ
పార్టీ(ఆప్) కూడా మహిళలకు పరిమిత సంఖ్యలోనే టిక్కెట్లిచ్చాయి. ఈ మూడు పార్టీల
నుంచి కేవలం 38 మంది మహిళా అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 2017 ఎన్నికలతో
పోలిస్తే ఈసారి వారి సంఖ్య పెరగడం కొంత ఊరటనిచ్చే విషయం. 2017లో బీజేపీ 12
మంది మహిళామణులకు టిక్కెట్లు ఇవ్వగా, ఈ ఎన్నికల్లో 18 మందికి అవకాశం
కల్పించింది. ఇక కాంగ్రెస్ విషయానికొస్తే.. 2017లో 10 మందికి, ఇప్పుడు 14
మంది ఆ పార్టీ టిక్కెట్లు లభించాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దళిత, గిరిజన
మహిళలకు టిక్కెట్లు ఇచ్చాయి. ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి మొత్తం 182 మంది
అభ్యర్థులు పోటీకి దిగారు. వీరిలో మహిళలు కేవలం ఆరుగురు. ఈ ఆరుగురిలో ముగ్గురు
ఎస్టీ రిజర్వ్డ్ స్థానం నుంచి పోటీ పడుతున్నారు. 13 స్థానాల్లో పోటీ
చేస్తున్న ఆలిండియా మజ్లిస్ ఇత్తెహదూల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) పార్టీ
చేస్తున్న ఇద్దరు మహిళలకు టిక్కెట్లు కేటాయించింది. వీరిలో ఒకరు ముస్లిం కాగా,
మరో మహిళ దళిత వర్గానికి చెందినవారు. బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ) 101
స్థానాల్లో పోటీ చేస్తోంది. 13 మంది మహిళలకు టిక్కెట్లు ఇచ్చింది. జాతీయ
పార్టీ అయిన సీపీఎం ఒక మహిళా అభ్యర్థిని ఎన్నికల బరిలో దింపింది. *
ఎస్సీ, ఎస్టీలకు మరిన్ని టిక్కెట్లు : బీజేపీకి 9 మంది మహిళా సిట్టింగ్
ఎమ్మెల్యేలు ఉండగా, ఈసారి ఐదుగురికి మొండిచెయ్యి చూపింది. నలుగురికి మరోసారి
టిక్కెట్లు కేటాయించింది. కాంగ్రెస్‌కు నలుగురు మహిళా సిట్టింగ్ ఎమ్మెల్యేల
ఉన్నారు. వీరిలో ఇద్దరికి మళ్లీ అవకాశం కల్పించింది. 2017 ఎన్నికల కంటే
ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ స్థానాల్లో మహిళా అభ్యర్థుల సంఖ్య పెరగడం
సానుకూల అంశం. 2017లో బీజేపీ ఎస్సీ స్థానాల్లో ఇద్దరికి, ఎస్టీ స్థానాల్లో ఒక
మహిళకు టిక్కెట్లు ఇవ్వగా, ఇప్పుడు ఎస్సీ స్థానాల్లో నలుగురికి, ఎస్టీ
స్థానాల్లో ఇద్దరికి పోటీ చేసే అవకాశం కల్పించింది. అప్పటి ఎన్నికల్లో
కాంగ్రెస్ నుంచి ఇద్దరు ఎస్టీ మహిళా అభ్యర్థులు పోటీ చేశారు. ఎస్సీలకు చోటు
దక్కలేదు. ఈసారి నలుగురు ఎస్టీ, ఒక ఎస్సీ మహిళా అభ్యర్థి కాంగ్రెస్
టిక్కెట్లు దక్కించుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ముగ్గురు ఎస్టీ మహిళలకు
టిక్కెట్లు ఇచ్చింది.
బిల్లు ఆమోదం పొందితే : చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు
కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందితేనే ఎన్నికల్లో
వారి సంఖ్య పెరుగుతుందని శాయాజీగంజ్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ
చేస్తున్న అమీ రావత్ చెప్పారు. ఉన్నత పదవుల్లో మహిళలను నియమించడంలో తమ పార్టీ
ముందంజలో ఉందని గుజరాత్ బీజేపీ మహిళా విభాగం అధ్యక్షురాలు దీపికాబెన్
సర్వాదా వెల్లడించారు. ఒక గిరిజన మహిళను తమ పార్టీ దేశ రాష్ట్రపతిగా
ఎన్నుకుందని గుర్తుచేశారు.