భారత్ జోడో యాత్ర నుంచి విరామం తీసుకున్న రాహుల్ సూరత్ జిల్లాలోని మహువా
ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ పై
విమర్శలు గుప్పించారు. మోర్బీ వంతెన కూలిన ఘటనలో నిందితులపై ఎలాంటి చర్యలు
తీసుకోవడం లేదని రాహుల్ ఆరోపించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
దగ్గరపడుతున్న వేళ ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రచార జోరు పెంచాయి. గత కొన్ని
రోజులుగా భారత్ జోడో యాత్రలో బిజీబిజీగా ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్
గాంధీ సోమవారం తొలిసారిగా ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా
అధికార బీజేపీ పై ఘాటు విమర్శలు చేశారు. మోర్బీ దుర్ఘటన విషయంలో అసలైన
నిందితులకు శిక్ష పడలేదని రాహుల్ ఆరోపించారు. 150 మంది చనిపోయారని దీన్ని
రాజకీయం చేయవద్దని, దాని గురించి తాను ఏమి మాట్లాడనని చెప్పానని గుర్తు
చేశారు. కానీ ఇప్పుడు ఆ నిందితులపై ఎందుకు చర్యలు తీసుకోలేదన్న ప్రశ్న
తలెత్తుతుందన్నారు. ఈ ఘటనకు సంబంధించిన అసలు నిందితులను విడిచిపెట్టి
వాచ్మెన్లను అరెస్ట్ చేసిందని ఆరోపించారు. ఎందుకంటే ఆ నిందితులకు గుజరాత్‌లోని
బీజేపీ తో మంచి సంబంధాలు ఉన్నాయని అందుకే వారిని అరెస్ట్ చేయలేదని
విమర్శించారు. ‘నిందితులపై ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు?.. బీజేపీతో సంబంధాలు
ఉన్న వారికి ఏమీ జరగదా?’ అని ప్రశ్నించారు.
భారత్ జోడో యాత్ర నుంచి విరామం తీసుకున్న రాహుల్ సూరత్ జిల్లాలోని మహువా
ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఆదివాసీలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ
దేశ ప్రజలను ఐక్యం చేసేందుకే తాను భారత్ జోడో యాత్ర చేపట్టానని రాహుల్
తెలిపారు. యాత్రలో భాగంగా తాను ఎంతోమంది రైతులు, యువత, ఆదివాసీ తెగ ప్రజలను
కలిసి వారి బాధలను తెలుసుకున్నానని చెప్పారు. గుజరాత్ పర్యటనలో భాగంగా రాహుల్
నేడు రాజ్‌కోట్‌లోనూ ప్రచారం చేపట్టనున్నారు.
‘ఆదివాసీలే ఈ దేశానికి తొలి యజమానులు . కానీ బీజేపీ వారిని ‘వనవాసులు’గా
పిలుస్తోంది. మీరు నగరాల్లో ఉండాలని, మీ పిల్లలు బాగా చదువుకుని డాక్టర్లు,
ఇంజినీర్లు కావాలని ఆ పార్టీ కోరుకోవట్లేదు. ఈ అడవుల్లోనే అణగారిపోవాలని
అనుకుంటోంది. అది అక్కడితో ఆగిపోదు. ఆ తర్వాత మీ అడవులను కూడా వారు
లాగేసుకుంటారు. బీజేపీ ఇలాగే అధికారంలో కొనసాగిస్తే వచ్చే 5-10 ఏళ్లలో
అడవులన్నీ ఇద్దరు ముగ్గురు పారిశ్రామికవేత్తల చేతుల్లోకి వెళ్లిపోతాయి.
అప్పుడు మీకు ఉండటానికి చోటు కూడా మిగలదని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.