లబ్ధిపొందనున్న 8 నుంచి 12వ తరగతి విద్యార్థునులు
రూ.69.52 కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం
మొత్తం 33 లక్షల కిట్లు పంపిణీ చేసేందుకు ప్రణాళిక
కొనుగోలు, పంపిణీ కోసం పరిపాలన అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు విడుదల చేసిన
ప్రభుత్వం
హైదరాబాద్ : రాష్ట్రంలో వైద్యారోగ్య రంగాన్ని పటిష్టం చేస్తున్న తెలంగాణ
ప్రభుత్వం, విద్యార్థినుల ఆరోగ్య సంరక్షణ కోసం ముఖ్యమైన చర్యలు
తీసుకుంటున్నది. ఈ సంవత్సరం బడ్జెట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్న
విధంగా ప్రభుత్వ పాఠశాలు, కళాశాలల్లో ఉచితంగా అడలోసెంట్ హెల్త్ కిట్ల
(శానిటరీ హైల్త్ అండ్ హైజెనిక్ కిట్లు) పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నది.
ఇందుకు గాను మొత్తం రూ. 69.52 కోట్లతో అడలోసెంట్ హెల్త్ కిట్ల కొనుగోలు,
పంపిణీ కోసం ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు హెల్త్
సెక్రెటరీ రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రాష్ట్రంలోని అన్ని
ప్రభుత్వ పాఠశాలల్లో, జూనియర్ కళాశాలల్లోని 8 నుంచి 12వ తరగతి
చదువుతున్న దాదాపు 11 లక్షల మంది విద్యార్థినులకు లబ్ధి చేకూరనున్నది.
ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన ఆరు నెలల కోసం11 లక్షల కిట్లు కొనుగోలు
చేయనున్నది. ఈ కిట్లో ఆరు శానిటరీ న్యాప్కిన్ ప్యాక్స్, వాటర్ బాటిల్,
ఒక బ్యాగ్ ఉంటుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం 22 లక్షల
కిట్లు కొనుగోలు చేయనున్నది. ఈ కార్యక్రమం అమలు చేస్తామని ప్రభుత్వం ఈ
ఏడాది బడ్జెట్లో ప్రకటించింది. ఇందులో భాగంగా ఇప్పుడు అమలు చేస్తున్నది.
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 ప్రకారం, 15-24 ఏళ్ల మధ్య వయసున్న
యువతుల్లో సుమారు 32శాతం మంది న్యాప్కిన్ లాగా క్లాత్ వినియోగిస్తున్నారు.
దీంతో గర్భాశయ, మూత్రకోశ సంబంధ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి. దీన్ని
దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం హెల్త్ అండ్ హైజెనిక్ కిట్లు పంపిణీ చేయాలని
నిర్ణయించింది. 14 నుంచి 19 సంవత్సరాల వయస్సున్న కౌమర బాలికలు
రుతుక్రమం సమయంలో శుభ్రత పాటించేందుకు ఇవి ఉపయోగపడనున్నాయి. దీంతో
వారు ఆరోగ్యవంతంగా ఉండేందుకు, తద్వారా చదువుపై మరింత శ్రద్ధ చూపించేందుకు
అవకాశం ఉంటుంది. విద్యార్థినుల హాజరు శాతం కూడా పెరిగేందుకు తోడ్పడుతుంది.