ఈనెల 27 వరకు సాగనున్న 41వ ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్
అమరావతి : పరిశ్రమలు, వాణిజ్య శాఖ నేతృత్వంలో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్
పెవిలియన్ ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ లాంఛనంగా
ప్రారంభించారు. 41వ భారత అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన -2022లో భాగంగా
ఢిల్లీలోని ప్రగతి మైదాన్ వేదికగా ఈ పెవిలియన్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఏర్పాటు చేసింది. “వోకల్ ఫర్ లోకల్ – లోకల్ టు గ్లోబల్” నేపథ్యంతో
తీర్చిదిద్దిన పెవిలియన్ ను ముఖ్య అతిథులుగా హాజరైన ఆర్థిక మంత్రి బుగ్గన,
రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి కలిసి ప్రారంభించారు. ఈనెల 27 వరకు సాగనున్న
ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ లో ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, సంప్రదాయాలు,
పర్యాటక ప్రత్యేకతను ప్రతిబింబించే భౌగోళిక గుర్తింపు కలిగిన 20 రకాల
ఏటికొప్పాక, మ్యాంగో జెల్లి, క్రిస్టల్ సంచులు, లెదర్ ఉత్పత్తులను పెవిలియన్
లో ఉంచారు. వీటన్నిటినీ ఒక జిల్లా ఒక ఉత్పత్తి కింద డ్వాక్రా, మెప్మా మహిళా
సంఘాల కృషితో రూపొందించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాలలో ప్రసిద్ధి చెందిన వస్తువులైన గుంటూరు మిర్చి,
ధర్మవరం పట్టు చీరలు, పావడాలు, కొండపల్లి బొమ్మలు, ఉదయగిరి చెక్కతో
తీర్చిదిద్దిన ఉత్పత్తులు, ఏటికొప్పాక బొమ్మలు, బొబ్బిలి వీణ, అరకు కాఫీ,
ఉప్పాడ చీరలు, వెంకటగిరి చీరలు, మంగళగిరి చీరలు, మచిలీపట్నం కలంకారి, బందరు
లడ్డు, తిరుపతి లడ్డు వంటి వస్తువులకు బ్రాండింగ్ పెంచి ప్రపంచ స్థాయిలో మరింత
మార్కెట్ పెంచాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ అడుగులు వేస్తున్నట్లు మంత్రి
బుగ్గన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ఆత్మనిర్భర్ భారత్ దిశగా
సామాజిక, ఆర్థిక పరిపుష్ఠి సాధించడమే ఏపీ అంతిమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
పెవిలియన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి బుగ్గన సహా రాజ్యసభ
సభ్యులు విజయసాయిరెడ్డి, పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
ఆర్.కరికాల వలవన్, ఆంధ్ర భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్, ఆదిత్యనాథ్
దాస్ , పరిశ్రమల శాఖ పెట్టుబడుల ప్రచారం, విదేశీవ్యవహారల సలహాదారు పీటర్ టీ
హసన్ , ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, చేనేత,జౌళి శాఖ ముఖ్య
కార్యదర్శి కె.సునీత, ఎన్వీ రమణా రెడ్డి ఐఆర్పీఎస్, హిమాన్షు కౌశిక్ ఐఏఎస్,
లేపాక్షి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విశ్వ, పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్
జీఎస్ రావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.