సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : అవినీతిపరులే దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారని సుప్రీంకోర్టు
ఆందోళన వ్యక్తంచేసింది. అవినీతి ద్వారా సంపాదించిన డబ్బుతోనే కేసుల నుంచి
బయటపడుతున్నారని వ్యాఖ్యానించింది. ఎల్గార్ పరిషద్ కేసులో అరెస్టై జైలుశిక్ష
అనుభవిస్తున్న గౌతమ్ నవ్లఖా తనను జుడిషియల్ కస్టడీలో కాకుండా ఆరోగ్య సమస్యల
దృష్ట్యా గృహనిర్బంధం చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై వాద
ప్రతివాదాలు జరిగాయి.
*తనను నిర్బంధించిన ముంబయిలోని తలోజా జైలులో కనీస సౌకర్యాలు కానీ, వైద్య
సదుపాయాలు కానీ లేవని నవ్లఖా తెలిపారు. ఈ వాదనలను జాతీయ దర్యాప్తు సంస్థ
(ఎన్ఐఏ) తరఫు న్యాయవాది అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్.వి.రాజు
వ్యతిరేకించారు. నవ్లఖా దేశాన్ని నాశనం చేయాలనుకొంటున్నారని రాజు వాదించారు.
దానికి న్యాయమూర్తులు జస్టిస్ కె.ఎం.జోసఫ్, జస్టిస్ హృషికేష్రాయ్
ధర్మాసనం ‘‘మీరు నిజంగా దేశాన్ని నాశనం చేస్తున్నవారెవరో
తెలుసుకోవాలనుకొంటున్నారా? దేశాన్ని ధ్వంసం చేస్తున్నది అవినీతిపరులే. వారి
మీద ఎవరు చర్య తీసుకుంటున్నారు? వారి పట్ల మనం పక్షపాతంతో ప్రవర్తిస్తున్నామని
ఎవరైనా ఆరోపిస్తే కాదనలేం. మన ప్రజాప్రతినిధులను కొనేయడానికి కోట్ల రూపాయలు
సిద్ధంగా ఉంచుకున్నామని కొందరు మాట్లాడుతున్న వీడియోను మేం చూశాం. వారు
దేశానికి వ్యతిరేకంగా ఏమీ చేయడం లేదని మీరు అనగలరా’’ అని పేర్కొన్నారు.
ఎంత అవినీతికి పాల్పడినా ధనబలంతో కొందరు సునాయాసంగా తప్పించుకొంటున్నారని
ఆవేదన వ్యక్తం చేశారు. దానికి అదనపు సొలిసిటర్ జనరల్ రాజు.. తాను
అవినీతిపరులను సమర్థించడం లేదనీ, వారిపై చర్యలు తీసుకోవాలంటున్నానని చెప్పారు.
70 ఏళ్ల నవ్లఖాను జైలు నుంచి గృహ నిర్బంధానికి మార్చడానికి షరతులు, సూచనలను
రాజు వివరించాలని సుప్రీంకోర్టు కోరింది. కనీసం కొంతకాలం గృహ నిర్బంధంలో ఉంచి
చూద్దామనీ, అతను ఏదైనా తప్పు చేస్తే మళ్లీ జైలుకు పంపవచ్చని న్యాయమూర్తులు
వ్యాఖ్యానించారు.