న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అక్కడి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. శీతాకాలానికి తోడు సమీప రాష్ట్రాలైన పంజాబ్, హర్యానాలో రైతులు పంట వ్యర్థాలను కాల్చడం వల్ల కాలుష్యం తీవ్రత పెరిగింది. ప్రస్తుతం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏఐక్యూ) 472 వద్ద ఉంది. ఇది చాలా ప్రమాదకర స్థితిని సూచిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ సహా పరిసర ప్రాంతాల ప్రజలు గడపదాటి బయటకు రావాలంటే మాస్కు ధరించక తప్పని పరిస్థితి నెలకొంది. రాజధాని ప్రాంతంలో గాలి నాణ్యత క్షీణించడంతో, అది మెరుగుపడే వరకు పాఠశాలలను మూసివేయాల్సిందిగా జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ, నోయిడా పరిధిలో పాఠశాలలు ఆన్ లైన్ బోధన ప్రారంభించాయి. ఢిల్లీ ప్రభుత్వం ఈ నెల 8వ తేదీ వరకు అన్ లైన్ క్లాసులు నిర్వహించాలని నిర్ణయించింది. అలాగే, విద్యార్థుల ఆరోగ్య సంరక్షణపై పాఠశాలల యాజమాన్యాలు దృష్టి సారించాయి. గాలి నాణ్యత మెరుగయ్యే వరకు పాఠశాలల ప్రాంగణాల్లో చిన్నారుల ఆటపాటలను నిలిపివేయాలని నిర్ణయించాయి. మరికొన్ని స్కూళ్లలో ఎయిర్ ప్యూరిఫయర్స్, వైద్య సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాయి.