కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండా
న్యూఢిల్లీ : రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఎఫ్‌పివో)ను ప్రోత్సాహించే ఉద్దేశంతో కేంద్ర ప్రభఉత్వం అమలు చేస్తున్న క్రెడిట్ గ్యారంటీ స్కీం కింద ఆంధ్రప్రదేశ్‌లో 406 రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్‌పివో) రిజిస్టర్ అయినట్లు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండా వెల్లడించారు. రాజ్యసభలో శుక్రవారం వి. విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా బదులిస్తూ ఈ ఏడాది జనవరి 31 నాటికి దేశవ్యాప్తంగా 7906 రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఈ పథకం కింద రిజిస్టర్ అయినట్లు తెలిపారు. ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, రాజస్థాన్, ఒడిశా రాష్ట్రాల తరువాత అత్యధిక ఎఫ్‌పీఓ (ఫార్మర్ ప్రోడ్సూసర్ ఆర్గనైజేషన్స్) రిజిస్టర్ అయిన రాష్ట్రాల జాబితాలో ఏపీ ఏడవ స్థానంలో ఉందని అన్నారు. రూ.4496 కోట్ల బడ్జెట్‌తో 2019-20 నుంచి 2023-24 వరకు 5 ఏళ్ళ కాలానికి రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటు, ప్రోత్సాహం పథకం ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. ఎఫ్‌పివోలు రిజిస్టర్ అయిన తేదీ నుంచి నుంచి 5 ఏళ్ళపాటు రుణ సహకారం అందించేందుకు 2024-25 నుంచి 2027-28 వరకు అదనంగా మూడేళ్ళ కాలానికి రూ.2369 కోట్ల రుణ సాయం అందిస్తున్నట్లు తెలిపారు.
పథకం ప్రారంభం నుంచి 2023-24వరకు ఏర్పాటైన ఎప్ఫీఓలకు 2027-28వరకు ఐదేళ్ళపాటు ఈ పథకం కింద సహకారం అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ పథకం కింద ఎఫ్పీఓలకు రుణ సహాయం అందించేందుకు క్రెడిట్ గ్యారంటీ ఫండ్‌ను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ఎఫ్‌పివోల కింద నమోదై రైతుల సమీకరణతోపాటు వ్యవసాయోత్పత్తులు చేస్తున్న వారు మాత్రమే క్రెడిట్ గ్యారెంటీ ఫండ్‌కు అర్హులని మంత్రి అన్నారు. ఈ మేరకు దేశంలో 2024 జనవరి 31 నాటికి 1097 ఎఫ్‌పివోలకు క్రెడిట్ గ్యారెంటీ కింద రూ.246.04 కోట్లు అందించినట్టు మంత్రి తెలిపారు. 2023 డిసెంబర్ 31 నాటికి దేశవ్యాప్తంగా 10 వేల రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటు, ప్రోత్సాహం పథకం అమలు చేస్తున్న ఏజెన్సీలకు రూ.1054.56 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. ఎఫ్ పీఓలు, సీబీబీఓ (క్లస్టర్ బేస్డ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్) ద్వారా చేసే ఖర్చు ఆయా సంఘాలు ఏర్పాటైన నుంచి 3 సంవత్సరాల వరకు చేసే రైతుల సమీకరణ, అద్దె చెల్లింపు, ఉద్యోగుల వేతనాలు, ఇతర ముఖ్య కార్యక్రమాలపై ఆధారపడి ఉంటుంది. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో 66 శాతానికి మించి 7960 రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటైనట్లు మంత్రి పేర్కొన్నారు.