ముంబయి: సీట్ బెల్ట్ గురించి ఓ స్టాండప్ కమేడియన్ హాస్యాస్పదంగా చేసిన ట్వీట్ ముంబయి పోలీసులకు ఆగ్రహాన్ని తెప్పించింది. ట్విటర్లో చమత్కారంగా స్పందించే వారు ఈసారి కాస్త గట్టిగానే బదులిచ్చారు. ‘ముంబయి వాసులారా.. ఈరోజు నుంచి సీట్ బెల్ట్ ధరించండి లేకపోతే ఈ టీ షర్ట్ వేసుకోండి’ అని స్టాండప్ కమేడియన్ అతుల్ ఖత్రి ఓ చిత్రాన్ని ట్వీట్ చేశారు. షర్ట్ డిజైన్‌ను బట్టి దానిని వేసుకున్నవారు సీట్ బెల్ట్ ధరించినట్లే కనిపిస్తుంది. బెల్ట్ పెట్టుకోకుండానే అది ఉన్నట్టుగా మభ్యపెట్టేలా ఉంది. ‘చలాన్లతో పాటుగా సీట్‌బెల్ట్‌ల స్టాక్ కూడా ఉంచుతాం. భద్రత ఎప్పటికీ జోక్ కాదు. మీ స్టాండప్ రోటీన్లో భాగంగా మీరు ఇలాంటి జోక్ వేసినప్పుడు..భద్రతకు సంబంధించిన సందేశాన్ని కూడా ఉంచండి’ అని ముంబయి పోలీసులు కాస్త గట్టిగా చెప్పారు. సీట్‌బెల్ట్ విషయంలో ముంబయి పోలీసులు ఇటీవల కొత్త నిబంధనలు విడుదల చేశారు. డ్రైవర్‌తో పాటు కారులో ఉన్న మిగతా ప్రయాణికులు కూడా సీట్ బెల్ట్ ధరించాలని అందులో వెల్లడించారు. నవంబర్ ఒకటి నుంచి అవి అమల్లోకి వచ్చాయి. ఇ-చలాన్ల రూపంలో చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ప్రముఖ వ్యాపారవేత్త సైరస్ మిస్త్రీ ఇటీవల ఓ కారు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో.. సీటు బెల్టుల ఆవశ్యకత అంశం వార్తల్లో నిలిచింది. ప్రమాద సమయంలో వెనక కూర్చున్న సైరస్ మిస్త్రీ.. సీటు బెల్టు ధరించలేదని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.