న్యూఢిల్లీ : జాతీయ హస్తకళల అభివృద్ధి కార్యక్రమం, సమగ్ర హస్తకళల క్లస్టర్ అభివృద్ధి పథకం కింద గడిచిన ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.3911.25 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్ర టెక్స్ టైల్స్ శాఖ సహాయ మంత్రి దర్శన జర్దోష్ పేర్కొన్నారు. రాజ్యసభలో వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా బదులిస్తూ 2018-19 నుండి 2023-24 వరకు నేషనల్ హాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఎన్హెచ్డిపి), సిహెచ్డిసి పథకాల కింద విడుదల చేసిన మొత్తం నిధుల్లో రూ.2439.8 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఎన్హెచ్డిపి కింద ఐదేళ్లలో రూ.3378.99 కోట్లు విడుదల చేయగా రూ.1907.54 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి తెలిపారు. అలాగే కాంప్రహెన్సివ్ హ్యాండిక్రాఫ్ట్ క్లస్టర్ డెవలప్మెంట్ స్కీం కింద ఐదేళ్లలో రూ.532.26 కోట్లు నిధులు మంజూరు చేసి విడుదల చేయగా మొత్తం నిధులు ఖర్చు చేసినట్లు తెలిపారు. హస్తకళల అభివృద్ధి కోసం ఎన్హెచ్డిపి, సిహెచ్డిసి పథకాలను వేర్వేరు ఉద్దేశాలతో రూపొందించినట్లు మంత్రి తెలిపారు. హస్తకళాకారులు పదివేల మందికి మించి ఉన్న ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, ఉత్పత్తి గొలుసు అభివృద్ధి చేయడం సిహెచ్సిడి పథకం ఉద్దేశమైతే, హస్తకళాకారులకు వ్యక్తిగతంగా అలాగే 1000 మందికి మించని చిన్న క్లస్టర్లకు మార్కెటింగ్ ప్లాట్ ఫాంలు ఏర్పాటు చేసి సామాజిక భద్రత కల్పించడం, నైపుణ్యాలను పెంపొందించడం ఎన్ హెచ్ డీపీ ఉద్దేశ్యమని తెలిపారు. ఎన్హెచ్డిపి స్కీం కింద మార్కెటింగ్ సదుపాయం, నైపుణ్యాభివృద్ధి, క్లస్టర్ అభివృద్ధి, ఉత్పత్తిదారుల కంపెనీలు ఏర్పాటు, హస్తకళాకారులకు డైరెక్ట్ బెనిఫిట్, మౌలిక సదుపాయాలు, సాంకేతిక సహకారం, హస్తకళాకారులకు, క్లస్టర్లకు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సహకారం అందించడం ద్వారా వ్యాపార ప్రోత్సాహక వాతావరణాన్ని కల్పించడం చేస్తున్నట్లు తెలిపారు. అలాగే సిహెచ్డిఎస్ కింద రాష్ట్ర స్థాయిలో ప్రాజక్టులు ఏర్పాటు చేయడం, అవి ఆయా రంగాల్లో విశేష అనుభవం కలిగిన కేంద్ర, రాష్ట్ర హ్యాండిక్రాఫ్ట్ కార్పొరేషన్లు, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం కింద 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా క్లస్టర్ ప్రాజక్టు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు.