జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ మహిళా అధ్యక్షురాలు డాక్టర్ అనుసూరి పద్మలత డిమాండ్
ఢిల్లీలోని ఆంధ్రాభవన్ వద్ద జాతీయ బీసీ సంక్షేమ సంఘం ధర్నా
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ మహిళా అధ్యక్షురాలు డాక్టర్ అనుసూరి పద్మలత కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఢిల్లీలోని ఆంధ్రాభవన్ వద్ద జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ పద్మలత ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ అనుసూరి పద్మలత మాట్లాడుతూ జాతీయ స్థాయిలో జనగణన కులగణన వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు.పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశ పెట్టి ఆమోదిస్తే బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు అమలవుతాయన్నారు. ఇప్పటికే స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం,బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు ఉన్నాయని,బీసీ బిల్లు ఆమోదిస్తే బలహీనవర్గాల నాయకులు పార్లమెంటు, అసెంబ్లీలో ప్రవేశించి రాజ్యాధికారం దిశగా అడుగులు వేస్తారని అన్నారు.మహిళా బిల్లు ఆమోదం పొందినప్పటికీ ఐదేళ్ళ తర్వాత ఆ రిజర్వేషన్లు వర్తింపచేయడం సరికాదని,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మహిళలకు 50 శాతానికి పైగా నామినేటెడ్ పదవులు కల్పిస్తున్నారని,ఆయనను ఆదర్శంగా తీసుకుని మిగతా రాజకీయ పార్టీలు మహిళలకు,బీసీలకు బిల్లుకు అతీతంగా, నినాదంలా కాకుండా, ఒక విధానంలా చట్టసభల్లో పోటీకి అవకాశం కల్పించాలని డాక్టర్ పద్మలత కోరారు. ధర్నా కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య, మాజీ పార్లమెంటు సభ్యుడు వి. హనుమంతరావు,బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు డాక్టర్ మారేష్, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొల్లేపల్లి సుభాషిణి, బీసీ యువసేన రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు బూడిద శరత్ కుమార్, ఓబీసీ నాయకులు అంగిరేకుల వరప్రసాద్, నాగార్జున, తెలంగాణ బీసీ నాయకులు నీలం వెంకటేష్, మహేంద్ర, కర్రి వేణు మాధవ్ , నందగోపాల్ తదితరులు పాల్గొన్నారు.