బెంగళూరు : కన్నడ ముద్దుబిడ్డ దివంగత పునీత్ రాజ్‌కుమార్‌ను ‘కర్ణాటక రత్న’తో సత్కరించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైన జూనియర్ ఎన్టీఆర్ చిరునవ్వుతో రాష్ట్ర ప్రజల అభిమానాన్ని గెలుచుకున్న వ్యక్తి పునీత్ అని పేర్కొన్నారు. ఆయన గొప్ప మనిషి అని తెలిపారు. 67వ కర్ణాటక రాజ్యోత్సవం సందర్భంగా దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్‌ను సన్మానించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం బెంగళూరులో భారీ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా ఆ రాష్ట్ర అత్యున్నత పౌర పురస్కారమైన ‘కర్ణాటక రత్న’తో పునీత్ రాజ్‌కుమార్‌ను సత్కరించింది. పునీత్ తరఫున ఆయన భార్య ఈ పురస్కారాన్ని స్వీకరించారు. ఈ వేడుకకు ప్రత్యేక అతిథులుగా సూపర్ స్టార్ రజనీకాంత్‌తో పాటు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కన్నడలో అనర్గళంగా మాట్లాడి ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు జూనియర్ ఎన్టీఆర్.
నటుడిగా తాను సాధించిన విజయాల వల్ల ఈ కార్యక్రమానికి హాజరు కాలేదని, పునీత్ రాజ్‌కుమార్ స్నేహితుడిగా ఇక్కడికి వచ్చానని అన్నారు. “కుటుంబం నుంచి వారసత్వం, ఇంటిపేరు మనకు వస్తాయి. కానీ వ్యక్తిత్వాన్ని సొంతంగా సంపాదించుకోవాలి. అహం, అహంకారం అనేవి లేకుండా తన వ్యక్తిత్వం, చిరునవ్వుతో మొత్తం రాష్ట్రాన్ని గెలుచుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పునీత్ రాజ్‌కుమార్ మాత్రమే” అని కొనియాడారు.