గుజరాత్ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుజరాత్ మోర్బీలోని ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు. వంతెన కూలిన ఘటనలో బాధితులతో ఆయన మాట్లాడారు. అంతకుముందు, ఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. గుజరాత్ మోర్బీలో బ్రిడ్జి కుప్పకూలిన ఘటనపై సమగ్ర దర్యాప్తు నిర్వహించడం అత్యవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఈ దిశగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. వంతెన కుప్పకూలిన ఘటనలో క్షతగాత్రులను నరేంద్ర మోడీ పరామర్శించారు. మోర్బీ ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించిన ఆయన ఆరుగురు బాధితులతో మాట్లాడారు. దాదాపు 15 నిమిషాల పాటు ఆసుపత్రిలో గడిపారు ప్రధాని. ఆసుపత్రిలో గాయపడ్డవారికి అందుతున్న చికిత్స గురించి ఆరా తీసిన మోడీ మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు.