సిట్టింగ్‌లకు వ్యతిరేకంగా అసమ్మతి నేతలు సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ నేతలకు అల్టిమేటం
హైదరాబాద్ : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నం అవుతోంది. ఇప్పటికే అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ 116 మందితో తొలి జాబితాను ప్రకటించింది. ఇప్పటి నుంచే ప్రచార పర్వం కొనసాగించాలని అధిష్టానం తమ అభ్యర్థులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎన్నికలు ఎప్పుడొచ్చినా పోటీకి సన్నద్ధమయ్యేలా ప్రచార పర్వాన్ని ఆ పార్టీ నేతలు కొనసాగిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ విడుదల చేసిన జాబితాలో చోటు దక్కింది. నకిరేకల్, కోదాడ, దేవరకొండ నియోజక వర్గాల్లో మాత్రం అసమ్మతి సెగలు కక్కుతున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా విషయానికి వస్తే బీఆర్ఎస్ బలం అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ సగం కూడా గెలిచే అవకాశం లేదని స్పష్టమవుతోంది. సిట్టింగ్‌లకు వ్యతిరేకంగా అసమ్మతి నేతలు సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ నేతలకు అల్టిమేటం ఇస్తున్నారు. అయితే ఎన్నికల సమయానికి అన్నీ సర్దుబాటు అవుతాయని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లా విషయానికి వస్తే బీఆర్ఎస్ బలం అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ సగం కూడా గెలిచే అవకాశం లేదని స్పష్టమవుతోంది. ముఖ్యంగా నల్గొండ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి కే సీటు కేటాయించగా ఆయన ఓడిపోతారని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గెలుస్తారని సర్వేలు చెప్తున్నాయి. అటు మునుగోడులో బీఆర్ఎస్ ప్రస్తుత ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి కూడా ఓటమి పాలవుతారని టాక్ నడుస్తోంది. ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య పోరు ఉండనుంది. ఉపఎన్నికలో ఓడిపోయినా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధిస్తారని సర్వేల్లో స్పష్టమైంది. మరోవైపు దేవరకొండ ఎస్టీ నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. రమావత్ రవీంద్రకుమార్ గెలుపు కష్టమని, కాంగ్రెస్ అభ్యర్థి నేనావత్ బాలునాయక్ విజయం సాధిస్తారని తెలుస్తోంది.
అటు నకిరేకల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య రసవత్తర పోరు నడుస్తోంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి వేముల వీరేశం స్వల్ప తేడాతో ఓటమి చెందారు. ఆయనపై కాంగ్రెస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య విజయం సాధించి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో వీరేశంకు ప్రాధాన్యత తగ్గడంతో పాటు ఆఖరికి టికెట్ కూడా ఇవ్వలేదు బీఆర్ఎస్ అధిష్టానం. ఇక చేసేదేమీ లేక చిరుమర్తిని ఈసారి ఓడించి తీరాల్సిందేనని కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి వీరేశం ఢిల్లీకి పయనమయ్యారు. గతంలో స్వతంత్ర అభ్యర్థికి ఇచ్చిన ‘ట్రక్కు’ గుర్తు దెబ్బతో ‘కారు’ పార్టీ ఓడిపోయింది. దీంతో ఈసారి వీరేశంకే గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నాయని కొన్ని సర్వేల్లో తేలింది. ఇక నాగార్జునసాగర్ నియోజకవర్గం విషయానికి వస్తే బీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ మరోసారి విజయం సాధించేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. కానీ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున జానారెడ్డి బదులు ఆయన కుమార్ రఘువీర్ రెడ్డి బరిలోకి దిగే అవకాశం ఉంది. దీంతో నోముల భగత్, రఘువీర్ రెడ్డి మధ్య ఆసక్తికర పోటీ ఉండనుంది.
మిర్యాలగూడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కర్‌రావు మరోసారి ఎమ్మెల్యే పదవిని కైవసం చేసుకోనున్నారు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేస్తారన్న విషయం సస్పెన్స్‌గా మారింది. ఈ విషయం ఆ పార్టీకి మైనస్ అవుతుందని ప్రచారం జరుగుతోంది. హుజూర్ నగర్ నియోజకవర్గం విషయానికి వస్తే బీఆర్ఎస్ కు మరోసారి నిరాశ తప్పేలా లేదు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచారు. అయితే ఆయన ఎంపీగా పోటీ చేయడంతో ఉపఎన్నిక జరిగింది. అప్పుడు ఈ సీటును బీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి కైవసం చేసుకున్నారు. కానీ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఉత్తమ్ పోటీ చేసే అవకాశం ఉండటంతో బీఆర్ఎస్ ఆశలు వదులుకోవాలని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. 46 శాతం ఓట్లతో ఆయన గెలుపు ఖాయమని వివరిస్తున్నాయి.
కోదాడ నియోజకవర్గం విషయానికి వస్తే గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్ విజయం సాధించారు. కానీ వచ్చే ఎన్నికల్లో మాత్రం ఆయనకు షాక్ తప్పదని ప్రచారం జరుగుతోంది. మల్లయ్య యాదవ్ పై కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ భార్య పద్మావతిరెడ్డి గెలుస్తారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సూర్యాపేట నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో మంత్రి జగదీష్ రెడ్డి కి ఎదురుగాలి తప్పదని సర్వేలు చెప్తున్నాయి. వరుసగా రెండుసార్లు గెలిపించినా జగదీష్ రెడ్డి చేసిన అభివృద్ధి ఏమీ లేదని ప్రజలు అభిప్రాయ పడుతున్నారని, అందుకే కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్ రెడ్డి ని గెలిపించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అటు తుంగతుర్తి ఎస్సీ నియోజక వర్గంలోనూ బీఆర్ఎస్ పార్టీకి షాక్ తప్పేలా లేదు. ఆ పార్టీ అభ్యర్థి గాదరి కిషోర్ పై కాంగ్రెస్ అభ్యర్థి అద్దంకి దయాకర్ 40 శాతానికి పైగా ఓట్లు సాధించి విజయం సాధిస్తారని సర్వేల్లో స్పష్టంగా తెలుస్తోంది. ఆలేరు నియోజకవర్గంలో మాత్రం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ మధ్య హోరాహోరీ పోరు తప్పదని సమాచారం. గొంగిడి సునీతారెడ్డి, బిక్షమయ్య గౌడ్ మధ్య ఆసక్తికర పోటీ ఉంటుందని తెలుస్తోంది. భువనగిరి నియోజకవర్గంలో మాత్రం బీఆర్ఎస్ మళ్లీ దక్కించుకోనుంది. ఆ పార్టీ అభ్యర్థి పైలా శేఖర్ రెడ్డి మరోసారి మంచి మెజారిటీతో గెలవనున్నట్లు సర్వేల్లో స్పష్టమైంది.
+