న్యూఢిల్లీ : భారత్ – ఫ్రాన్స్‌ల మధ్య ఉన్న రక్షణ సంబంధాలను మరో స్థాయికి తీసుకెళ్లే దిశగా చర్చించామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఇటీవల ఫ్రాన్స్‌లో పర్యటించిన ఆయన ఆ దేశ రక్షణ శాఖ మంత్రి సెబాస్టియన్ లెకార్నుతో ప్యారిస్‌లో భేటీ అయ్యారు. ‘సైబర్‌స్పేస్, కృత్రిమ మేధ వంటి రంగాల్లో మరింత సహకారాన్ని పెంచుకోవడంపై సెబాస్టియన్‌తో చర్చించా. రక్షణ పారిశ్రామిక రంగంలో ఇరు దేశాల బంధాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లడానికి ఇదే సరైన సమయం’ అని రాజ్‌నాథ్ ట్విటర్లో పేర్కొన్నారు. తన పర్యటనలో భాగంగా ఆయన జెట్ ఇంజిన్ తయారీ కేంద్రం సాఫ్రాన్‌ను సందర్శించారు. ఆ దేశ రక్షణరంగ పరిశ్రమల సీఈవోలతోనూ భేటీ అయ్యారు. ప్రస్తుతం ఇరు దేశాల భాగస్వామ్యంతో నడుస్తున్న ప్రాజెక్టులు, సైనిక పరమైన సంబంధాలు తదితరాలపై మంత్రులిద్దరూ చర్చించుకున్నారని రక్షణశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.