ఇంఫాల్ : మణిపుర్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ బార్డర్
రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్వో) అధికారులతో సమావేశం నిర్వహించారు. మయన్మార్
సరిహద్దులో 70 కిలోమీటర్ల మేర అదనపు కంచె ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను వారికి
వివరించారు. ఈశాన్య రాష్ట్రం మణిపుర్ నాలుగు నెలలుగా జాతుల మధ్య ఘర్షణలతో
అట్టుడికిపోతోంది. ఇటీవలే అక్కడ పరిస్థితి కాస్త సద్దుమణిగినట్లు
కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్
మయన్మార్ సరిహద్దు వెంబడి భద్రతపై దృష్టి సారించారు. ఆ దేశం నుంచి
చొరబాట్లను నివారించేందుకు 70 కిలోమీటర్ల మేర కంచె నిర్మించాలని ప్రణాళిక
రచిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయనే ట్విటర్లో వెల్లడించారు. ముఖ్యమంత్రి
బీరేన్‌సింగ్ ఇంఫాల్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘ఫ్రీ మూవ్మెంట్ రెజిమ్’
వల్ల భారత్-మయన్మార్ ప్రజలు ఇరువైపులా ఎలాంటి పత్రాలు లేకుండా 16 కి.మీ మేర
సంచరించే వీలుందన్నారు. దీని కారణంగా అక్రమ వలసదారులు భద్రతా సిబ్బంది కంట
పడకుండా తప్పించుకోగలుగుతున్నారని చెప్పారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకొని
కేంద్ర ప్రభుత్వం ‘ఫ్రీ మూవ్మెంట్ రెజిమ్’ను రద్దు చేయాలని కోరారు. ఈ
నేపథ్యంలోనే ముఖ్యమంత్రి ఆదివారం బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్వో)
అధికారులతో సమావేశం నిర్వహించారు.
సీఎస్, డీజీపీ సహా హోంశాఖ అధికారులు ఇందులో పాల్గొన్నారు. భారత్-మయన్మార్
సరిహద్దులో 70 కిలోమీటర్ల మేర అదనపు కంచె ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను
బీఆర్వోకు సీఎం వివరించారు. సరిహద్దులోని లోపాల కారణంగా పొరుగు దేశం నుంచి
అక్రమ వలసలు, స్మగ్లింగ్ కార్యకలాపాలు పెరుగుతున్నాయని బీరేన్ సింగ్
పేర్కొన్నారు. అందుకే అత్యవసరంగా అదనపు కంచె ఏర్పాటు చేయాలని కోరారు.
భారత్-మయన్మార్ మొత్తం సరిహద్దు పొడవు 1600 కి.మీ. ఈశాన్య రాష్ట్రం
మణిపుర్లో ఐదు జిల్లాలు 400 కి.మీ సరిహద్దును పంచుకుంటున్నాయి. ఇందులో కంచె
కేవలం 10 శాతం లోపే ఉంది. దాంతో ఇబ్బడిముబ్బడిగా మాదక ద్రవ్యాలు భారత్‌లోకి
వచ్చిపడుతున్నాయి. భౌగోళిక పరిస్థితులు, ఆర్థిక కారణాల వల్ల మొత్తం సరిహద్దుకు
కంచె వేయడం సాధ్యం కాదని వ్యూహాత్మక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే,
అక్రమ వలసలు అధికంగా ఉన్న చోట్ల మాత్రం కంచె వేసుకునే వెసులుబాటు ఉందని
చెబుతున్నారు. మణిపుర్లో మే 3 జాతుల మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. ఆ అల్లర్లలో
సుమారు 175 మందికి పైగా చనిపోయారు. వందల మంది గాయపడ్డారు.