స్వచ్ఛత కోసం ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు
హైదరాబాద్ బాలికను ప్రశంసించిన ప్రధాని
న్యూఢిల్లీ : స్వచ్ఛత కోసం ఒక గంట శ్రమదాన్ పేరుతో దేశవ్యాప్తంగా అక్టోబర్
1న పరిశుభ్రతా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం
వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా
ఒకేరోజు పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. స్వచ్ఛత కోసం ఒక గంట
శ్రమదాన్ ) కార్యక్రమాన్ని అక్టోబర్ 1న నిర్వహించనున్నట్లు కేంద్ర గృహ
నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ వెల్లడించింది. గాంధీ జయంతిని (అక్టోబర్ 2)
పురస్కరించుకొని ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపు మేరకు దీన్ని చేపట్టనున్నట్లు
తెలిపింది. ‘మన్ కీ బాత్’ 105వ ఎపిసోడ్లో భాగంగా ప్రధాని మోదీ చేసిన రేడియో
ప్రసంగంలో ‘స్వచ్ఛత కోసం ఓ గంట శ్రమదానం చేయండని పిలుపునిచ్చారు. అక్టోబర్ 1న
ఉదయం 10గంటలకు సమష్టిగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అన్నారు. మహాత్మాగాంధీ
జయంతి సందర్భంగా ఆయనకు ఇది ‘స్వచ్ఛాంజలి’ అవుతుందన్నారు.
అక్టోబర్ 1న మార్కెట్లు, రైల్వే ట్రాకులు, పర్యాటక కేంద్రాలు, నీటి వనరులు,
ప్రార్థనా మందిరాలతోపాటు జనసముదాయ ప్రాంతాల్లో చేపట్టే ఈ భారీ శుభ్రతా
కార్యక్రమంలో పాల్గొనాలని పౌరులకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. ప్రతి పట్టణం,
ప్రతి గ్రామ పంచాయతీతోపాటు పౌర విమానయానం, రైల్వేలు, ఐటీ వంటి ప్రభుత్వ
సంస్థల్లోనూ స్థానిక పౌరుల భాగస్వామ్యం ఉంటుందని తెలిపింది. ఇందులో
పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న ఎన్జీవోలు, సంక్షేమ సంఘాలు, ప్రైవేటు సంస్థలు..
ఆన్లైన్ పోర్టల్లో అప్లై చేసుకోవడం లేదా జిల్లా యంత్రాంగాన్ని
సంప్రదించాలని కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలియజేసింది.
హైదరాబాద్ బాలికను ప్రశంసించిన ప్రధాని : హైదరాబాద్కు చెందిన బాలికపై
ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు. ప్రతి నెల మన్ కీ బాత్
కార్యక్రమం ద్వారా కీలక అంశాలపై ప్రధాని మోడీ ప్రసంగిస్తుంటారు. దీనిలో
భాగంగా ఆయన హైదరాబాద్కు చెందిన ఆకర్షణ సతీశ్ పై ప్రశంసలు కురిపించారు.
ఆకర్షణ సతీశ్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఏడో తరగతి చదువుతోంది. పుస్తక
పఠనంపై ఉన్న ఆసక్తితో ఇతరులను కూడా చదివించాలని ప్రయత్నిస్తోంది. తండ్రి డా.
సతీశ్ కుమార్ ప్రోత్సాహంతో పుస్తకాలను సేకరించడం అలవాటు చేసుకుంది.
అంతేకాకుండా ఆసుపత్రి అధికారుల అనుమతితో ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో, పలు
ప్రాంతాల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేసింది. చిన్న వయసులోనే సమాజానికి తన వంతు
కృషి చేస్తున్నందుకు ఈ కార్యక్రమం ద్వారా ఆకర్షణని ప్రధాని మోడీ అభినందించారు.
ఆకర్షణ సతీశ్ చదవడం, కొత్త విషయాలను నేర్చుకోవడంలో ఉన్న ఆనందాన్ని హైదరాబాద్
పరిసర ప్రాంతాలకు విస్తరిస్తోంది. ఈ బాలిక కృషికి నా అభినందనలు. ఆకర్షణను చూసి
గర్విస్తున్నానని అన్నారు. చిన్నారి ప్రయత్నానికి మెచ్చిన రాష్ట్రపతి నుంచి
కూడా గతంలో ప్రశంసలు లభించాయి.