న్యూఢిల్లీ : మన్ కీ బాత్‌లో భాగంగా ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ దేశ
పౌరులకు కీలక విజ్ఞప్తి చేశారు. పండుగ సీజన్లో ప్రతి ఒక్కరు దేశంలో తయారైన
ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని సూచించారు. ప్రపంచ వాణిజ్యానికి ఇండియా-మిడిల్
ఈస్ట్-యూరప్ కారిడార్ దశాబ్దాలపాటు ఆధారంగా నిలుస్తుందని, చరిత్రలో దీన్ని
గుర్తుచేసుకుంటారని ప్రధాని మోడీ అన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో
భాగంగా పలు అంశాలపై ప్రసంగించిన ప్రధాని దేశం గొప్ప వాణిజ్య శక్తిగా
ఉన్నప్పుడు సిల్క్ రూట్‌ను ఉపయోగించదనే విషయాన్ని గుర్తు చేసుకున్నారు. జీ20
సదస్సు సందర్భంగా ‘‘ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్’’ను
భారత్ సూచించిందని చెప్పారు. చంద్రయాన్-3 విజయం, జీ20 సదస్సు నిర్వహణ దేశంలో
ప్రతి పౌరుడి ఆనందాన్ని రెట్టింపు చేశాయని మోదీ అభిప్రాయపడ్డారు. ప్రజల నుంచి
తనకు వచ్చిన సందేశాల్లో ఎక్కువగా ఈ రెండింటి గురించే ప్రస్తావించినట్లు
తెలిపారు.
ఆ ఘనత దేశ మహిళలదే : జీ20 అధ్యక్ష హోదాలో ఆఫ్రికన్ యూనియన్‌కు శాశ్వత
సభ్యత్వం ఇవ్వడం ద్వారా భారత దేశ నాయకత్వాన్ని ప్రపంచం గుర్తించిందని ప్రధాని
మోడీ పేర్కొన్నారు. సదస్సుకు ఆతిథ్యం ఇచ్చిన ‘భారత్ మండపం’ ప్రస్తుతం
సెలబ్రిటీగా మారిందని, ప్రజలు దాని ముందు నిలబడి సెల్ఫీలు తీసుకుంటున్నారని
అన్నారు. సెప్టెంబరు 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని నిర్వహిస్తున్న
విషయాన్ని గుర్తుచేశారు. ఈ రంగం తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉపాధి
కల్పిస్తుందని, పర్యాటకులను ఆకట్టుకునేందుకు చిత్తశుద్ధి అవసరమని ప్రధాని
అభిప్రాయపడ్డారు. జీ20 సదస్సు నిర్వహణ తర్వాత భారత దేశ చిత్తశుద్ధి మరింత
పెరిగింది. ఈ సమావేశాల సందర్భంగా భారత్‌కు వచ్చిన వివిధ దేశాల ప్రతినిధులు
దేశంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి, మన సంస్కృతి, వారసత్వ సంపదలు, వైవిధ్యం
గురించి తెలుసుకున్నారు. పశ్చిమబెంగాల్లోని శాంతినికేతన్‌కు, కర్ణాటకలోని
హోయసల ఆలయానికి ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చోటు దక్కడం ఎంతో గర్వించదగిన
విషయం. ఈ రెండింటి గుర్తింపుతో భారత్‌లో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితా 42కు
చేరిందని ప్రధాని మోడీ అన్నారు.
స్థానిక భాషల్లో చట్టాలు..ఐపీసీనీ మారుస్తున్నాం : అక్టోబరు 2న గాంధీ జయంతి
సందర్భంగా కేంద్ర ప్రభుత్వ శాఖలు ‘స్వచ్ఛతా హీ సేవా’ పేరుతో కార్యక్రమాలు
నిర్వహించడంపై ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. దేశంలోని ప్రతి పౌరుడు ఇందులో
భాగస్వామి కావాలని కోరారు. అదే గాంధీజీకి అర్పించే నిజమైన నివాళి అని ప్రధాని
అభిప్రాయపడ్డారు. పండుగ సీజన్ ప్రారంభంకానున్న నేపథ్యంలో దేశ పౌరులకు ప్రత్యేక
విజ్ఞప్తి చేశారు. ‘వోకల్ ఫర్ లోకల్’ స్ఫూర్తితో ప్రతి ఒక్కరు భారత్‌లో
తయారైన ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని ప్రధాని సూచించారు.