విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ వ్యాఖ్యానించారు. వారేమీ తమ సరుకులతో
ఆసియా-ఆఫ్రికా మార్కెట్లను ముంచెత్తడంలేదన్నారు. ఈ నేపథ్యంలో వారిని ప్రతికూల
దృక్పథంతో చూడాల్సిన అవసరం లేదన్నారు. పీఎం విశ్వకర్మ పథకం ప్రారంభం సందర్భంగా
తిరువనంతపురం వెళ్లిన ఆయన ఓ మలయాళీ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు
ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో తానేమీ పశ్చిమ దేశాల కోసం వకాల్తా
పుచ్చుకోలేదని వివరణ కూడా ఇచ్చారు. పశ్చిమ దేశాలేవీ తమ సరుకులతో ఆసియా-ఆఫ్రికా
మార్కెట్లను ముంచ్చెత్తడం లేదు. ఈ నేపథ్యంలో పశ్చిమ దేశాలు చెడ్డవనే పాతకాలం
అపోహల నుంచి బయటపడాలి. మరో కోణంలో చూస్తే అవి అభివృద్ధి చెందిన దేశాలు.
ప్రపంచం సంక్లిష్టంగా ఉంటుంది. సమస్యలు మరింత సంక్లిష్టంగా ఉంటాయని అన్నారు.
భారత్‌ను పేద, అభివృద్ధి చెందుతున్న దేశాల నాయకుడిగా చూడటం ఇష్టం లేకనే చైనా
అధ్యక్షుడు జిన్‌పింగ్ జీ20 సదస్సుకు హాజరు కాలేదా..? అనే ప్రశ్నకు జైశంకర్
స్పందిస్తూ..‘‘ప్రస్తుతం సమస్య ఆయా దేశాల ప్రజల్లో ఓ బలమైన భావనను
కలిగించింది. గత 15-20 ఏళ్లుగా గ్లోబలైజేషన్లో అసమానతలు పెరిగిపోయాయి. కొన్ని
దేశాలకు చేందిన చౌక వస్తువులే మార్కెట్లను ముంచెత్తడంతో.. ప్రపంచ దేశాలు
కొన్ని ఒత్తిడికి గురై తమ సరుకులు, ఉద్యోగాలకు చోటెక్కడని చూస్తున్నాయి.
ముఖ్యంగా ఈ దేశాలు గత 20 ఏళ్లుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీరు, కొవిడ్
మహమ్మారి, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఇంధన, ఆహార వస్తువుల ధరల పెంపు సమస్యను
అనుభవిస్తున్నాయి. దీంతో తమను ఇతర దేశాల ఆర్థిక వృద్ధి కోసం వాడుకొంటున్నాయనే
ఆగ్రహం వారిలో ఉంది. దానికి పశ్చిమ దేశాలను బాధ్యులను చేయకూడదు. నేనేమీ పశ్చిమ
దేశాలకు వకాల్తా పుచ్చుకోలేదు. నేటి గ్లోబలైజేషన్లో ఉత్పత్తి
కేంద్రీకృతమైంది. దాని పరిమితులు ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం
చేస్తున్నాయి. భారత్ తయారీ రంగం, వ్యవసాయం, చంద్రయాన్-3 వంటి శాస్త్ర
సాంకేతిక పురోగతి, వ్యాక్సినేషన్ వంటి అంశాల కారణంగా తమలో ఒక దేశానికి
తట్టుకొని నిలబడి పురోగతి సాధించగల సత్తా ఉందని పేద, అభివృద్ధి చెందుతున్న
దేశాల్లో ఓ నమ్మకం కలిగింది’’ అని పేర్కొన్నారు. జీ20 సదస్సుల్లో గ్లోబల్
సౌత్, 120 దేశాల వాణిని సమష్టిగా వినిపించామని జైశంకర్ వివరించారు.
ఉక్రెయిన్‌పై యుద్ధానికి రష్యాను నిందించే కార్యక్రమాన్ని జీ20 సదస్సు నుంచి
భారత్ ఎలా తప్పించిందనే ప్రశ్నకు జైశంకర్ స్పందిస్తూ అక్కడ చాలా
పట్టువిడుపులు చోటు చేసుకొన్నాయి. బాలి సదస్సులో రష్యాను తీవ్రంగా నిందించారు.
కానీ ఇది న్యూఢిల్లీ. అందుకే.. ఇక్కడ డిక్లరేషన్ సాధ్యమైందని జైశంకర్
అన్నారు.