గుజరాత్లోని మచ్చు నదిపై వంతెన కూలిన ఘటనకు సంబంధించి 9 మందిని అరెస్ట్ చేసినట్టు రాజ్కోట్ రేంజ్ ఐజీ అశోక్ యాదవ్ తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో బ్రిడ్జి కాంట్రాక్టర్, టికెట్ క్లర్కులు కూడా ఉన్నట్టు పేర్కొన్నారు. వంతెన కూలిన ఘటనలో 133 మంది ప్రాణాలు కోల్పోగా, 100 మందికిపైగా గాయపడ్డారు. అరెస్ట్ అయిన వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు అశోక్ యాదవ్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని ఆధారాలు లభ్యమైన తర్వాత మరింత మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుంటారని పేర్కొన్నారు. అలాగే, ఈ ఘటనపై విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్టు వివరించారు.
మోర్బీ బ్రిడ్జి కూలిన ఘటనలో తీవ్రంగా గాయపడిన 40 ఏళ్ల మెహుల్ రావల్ కృష్ణా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన కుడి కాలికి బాగా గాయమైంది. మరో రెండు రోజుల్లో ఆయన కాలికి శస్త్రచికిత్స చేయనున్నట్టు వైద్యులు తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు తన కుటుంబ సభ్యులు 8 మంది బ్రిడ్జిపై ఉన్నట్టు మెహుల్ రావల్ తెలిపారు. వారిలో తన బావ, సోదరి, ఇద్దరు మేనల్లుళ్లు, సోదరుడు, మరో సోదరి, వారి ఇద్దరు పిల్లలు ఉన్నట్టు చెప్పారు. తన కుటుంబంలోని మరో ఇద్దరితోపాటు ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగతా వారి సంగతి తెలియక కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బ్రిడ్జిపై జనం ఎక్కువగా ఉండడంతో తన కుటుంబ సభ్యులు తిరిగి వెనక్కి వస్తున్నప్పుడు, ఒడ్డుకు కాస్త దూరంలో ఉండగా బ్రిడ్జి కుప్పకూలిందని, తాను కిందపడి గాయపడ్డానని మెహుల్ వివరించారు.