అంతర్జాతీయంగా ముఖ్యభూమిక పోషిస్తోంది
సమర్థ నాయకత్వం, అవినీతి రహిత పాలనే విజయరహస్యం
భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు
దక్షిణ భారత వాణిజ్య పురస్కారాల ప్రదానం
దుబాయి : అంతర్జాతీయంగా భారత్ ఇప్పుడు వెలుగులీనుతోందని భారత పూర్వ
ఉపరాష్ర్టపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. ఆర్థికాభివృద్ధి విషయంలోనే
కాకుండా అంతర్జాతీయ సంబంధాల పరంగా కూడా భారత్ ముఖ్య భూమిక పోషిస్తోందని
చెప్పారు. ఇటీవల జీ-20 సదస్సును భారత్ విజయవంతంగా నిర్వహించడం ఇందుకు
నిదర్శనమని చెప్పారు. వెంకయ్యనాయుడు దుబాయిలో జరిగిన దక్షిణ భారత వాణిజ్య
పురస్కారాల ప్రదానోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా
ఆయన మాట్లాడుతూ ఏకాభిప్రాయాన్ని సాధించే సామర్థ్యం, అంతర్జాతీయంగా వివిధ
దేశాల మధ్య సహకారం కోసం మార్గసూచీని సిద్ధం చేయగల నేర్పు భారత్ కు ఉందని జీ-20
నేతల ప్రకటన ప్రతిఫలించిందని చెప్పారు. వసుధైక కుటుంబకం అన్న సనాతన భారతీయ
ధర్మం ప్రాధాన్యాంశంగా ఈ సదస్సును నిర్వహించిన భారత్ నాయకత్వం ఈ భూగోళంపై
జీవులన్నీ పరస్పరాధారితాలన్న విషయాన్ని, పర్యావరణ పరంగా సుస్థిర
ప్రత్యామ్నాయాల ప్రాముఖ్యాన్ని చాటి చెప్పిందని పేర్కొన్నారు. భారత్-మధ్య
ప్రాచ్య-ఐరోపా ఆర్థిక నడవా ఏర్పాటుకు భారత్, అమెరికా, యూఏఈ, సౌదీఅరేబియా,
జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, ఐరోపా సమాఖ్యలు సంయుక్తంగా అవగాహన ఒప్పందంపై సంతకం
చేయడం భారత్ నాయకత్వంలోని ఇటీవలి జీ-20 సదస్సులో సాధించిన ఒక గొప్ప మైలు రాయి
అని చెప్పారు. ఆసియా-ఐరోపాల మధ్య ఆర్థిక అనుసంధానత మరింతగా పెరగడానికి ఈ నడవా
బాగా ఉపకరిస్తుందని వెంకయ్య నాయుడు చెప్పారు.
గడచిన 9ఏళ్ల కాలంలో భారత్ గణనీయ అభివృద్ధి సాధించిందని వెంకయ్య నాయుడు
చెప్పారు. భవిష్యత్తులోనూ ఇది కొనసాగుతుందని, సమర్థమైన, అవినీతి రహిత నాయకత్వం
కారణంగానే ఇది సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ
నాయకత్వంలో ప్రజాప్రయోజనాలే లక్ష్యంగా ప్రజాభాగస్వామ్యంతో పరిపాలన
కొనసాగుతోందని, అన్ని రంగాల్లో దేశం దూసుకుపోతోందని చెప్పారు. ప్రస్తుతం
భారత్ ప్రపంచంలోనే ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని, ఈ దశాబ్దం తిరిగే
నాటికి 5 ట్రిలియన్ డాలర్ల లక్ష్యంతో మూడో పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం
తథ్యమని స్పష్టం చేశారు. భారత్ లో నిపుణులైన, ప్రతిభావంత యువ జనాభాకు కొదవ
లేదని, యువ మానవవనరుల పరంగా ప్రపంచంలోనే రెండోస్థానంలో ఉందని, భారత్ వృద్ధి
పయనానికి ఇది కీలకాంశమని వెల్లడించారు.
భారత్ ఇప్పుడు పెట్టుబడులకు స్వర్గధామమని, అంకురపరిశ్రమలకు అనుగుణమైన
పరిస్థితుల కల్పనలో ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉందని చెప్పారు.
పరిశ్రమలు-అంతర్గత వాణిజ్య ప్రోత్సాహ విభాగం గుర్తింపు పొందిన 98,000 అంకుర
పరిశ్రమలు, 100కు పైగా యూనికార్న్ అంకురపరిశ్రమలు భారత్ లో ఉన్నాయని గుర్తు
చేశారు. కనిష్ఠ ప్రభుత్వం-గరిష్ఠ పరిపాలన సూత్రం కారణంగా భారత్ లో సర్వతో
ముఖాభివృద్ధి వేగిరంగా చోటు చేసుకుంటోందన్నారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా
ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రభుత్వం పలు చర్యలు తీసుకుందని, అవి
సత్ఫలితాలిచ్చాయని తెలిపారు. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన ద్వారా 50 కోట్ల
మందికి పైగా ఖాతాదారులకు రూ. 2,02,915.95 కోట్ల వరకు లబ్ధి చేకూరిందని,
ప్రపంచంలోనే అతి పెద్ద పేదరిక నిర్మూలన పథకాల్లో ఇది ఒకటని చెప్పారు.
లబ్ధిదారులకు నేరుగా నగదు బదిలీ చేసిన ఈ పథకం ద్వారా సమాజంలో అత్యంత అణగారిన
వర్గాల పై నేరుగా సానుకూల ప్రభావాన్ని చూపిందన్నారు. లబ్ధిదారుల్లో 27 కోట్ల
మందికి పైగా మహిళలే ఉండడం విశేషమన్నారు. జల్ జీవన్ మిషన్, గరీబ్ కల్యాణ్ యోజన,
ప్రధాన మంత్రి జన్ ఆవాస్ యోజన, ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన, అటల్ పెన్షన్
యోజన వంటి పథకాలతో పేదల జీవితాల్లో ప్రభుత్వం వెలుగులు నింపుతోందని చెప్పారు.
డిజిటల్ లావాదేవీల్లోనూ భారత్ దూసుకెళ్తోందని వెంకయ్య నాయుడు చెప్పారు. మరో
వైపు ప్రపంచంలో కొన్ని చోట్ల భౌగోళిక-రాజకీయ అనిశ్చితులు, ఆర్థిక మాంద్యాలు,
అభివృద్ధి చెందిన దేశాల్లో ద్రవ్యోల్బణం వంటి ఆర్థిక అలజడులున్నా ఈ ఏడాది
భారత్ 750 బిలియన్ డాలర్ల ఎగుమతులను సాధించగలిగిందని చెప్పారు. భారత్ లో చోటు
చేసుకుంటున్న నిర్మాణాత్మక సంస్కరణలు, వేగిర ఆర్థికాభివృద్ధి ని చూసే
అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ భారత్ ను వెలుగు చుక్క గా అభివర్ణించిందని గుర్తు
చేశారు. దక్షిణ భారత వ్యాపార పురస్కారాలు వరించిన వాణిజ్యవేత్తలకు ఈ సందర్భంగా
వెంకయ్య నాయుడు అభినందనలు తెలిపారు.