న్యూ ఢిల్లీ : పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల తొలిరోజు అజెండాను కేంద్రం
ప్రకటించింది. పార్లమెంట్ 75 ఏళ్ల ప్రయాణంపై చర్చించనున్నట్లు వెల్లడించింది.
ఓ కీలక బిల్లును సైతం ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది.
సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు ఐదు రోజుల పాటు జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక
సమావేశాల్లో తొలి రోజు భేటీకి సంబంధించిన అజెండాను కేంద్ర ప్రభుత్వం
ప్రకటించింది. ’75 ఏళ్ల పార్లమెంట్ ప్రయాణం’ అనే అంశంపై తొలి రోజు
చర్చించనున్నట్లు తెలిపింది. రాజ్యాంగ సభ ప్రారంభం నుంచి ఇప్పటివరకు జరిగిన
వివిధ ఘటనలపై సభ్యులు మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. అదేసమయంలో ప్రభుత్వం కీలక
బిల్లులను సభలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది.ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్
నియామకానికి సంబంధించిన బిల్లును ఈ సమావేశాల్లో సభ ముందుకు తీసుకురానున్నట్లు
ప్రభుత్వం వెల్లడించింది. గత వర్షకాల సమావేశాల్లో ఈ బిల్లును రాజ్యసభలో
ప్రవేశపెట్టారు. దీంతో పాటు లోక్సభ షెడ్యూల్లో 2023-పోస్ట్ ఆఫీస్ బిల్లును
చేర్చారు. ఈ బిల్లు సైతం ఇదివరకే రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ప్రెస్
రిజిస్ట్రేషన్లు, పీరియాడికల్స్ బిల్లు, ది అడ్వొకేట్స్ బిల్లులు సైతం ఈ
అజెండాలో ఉన్నాయి. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు
జరగనున్నాయి. ఈ సమావేశాలు పాత భవనంలో కాకుండా కొత్త పార్లమెంట్ భవనంలో
నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
అప్పుడే ప్రకటన.. అజెండాపై సస్పెన్స్
కాగా, పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు ఆగస్టు 31న
ప్రకటించింది కేంద్రం. అజెండా ఏంటో చెప్పకుండానే ఈ సమావేశాలపై ప్రకటన చేసింది.
దీంతో పార్లమెంట్లో ఏం చర్చించనున్నారనే విషయంపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమైంది.
పార్లమెంట్ కొత్త భవనంలోకి మారేందుకే ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారని
ఊహాగానాలు వెలువడ్డాయి. జీ20 సదస్సు, జమ్ము కశ్మీర్ ఎన్నికల అంశంపైనా
సమావేశాల్లో చర్చించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. కాగా పార్లమెంట్ వర్షాకాల
సమావేశాలు జులై 20 నుంచి ఆగస్టు 11 మధ్య జరిగాయి. ఈ సమావేశాల్లో అధికార,
విపక్షాల మధ్య వాడీ వేడీ చర్చ జరిగింది. ఇండియా కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస
తీర్మానంపై సభలో హోరాహోరీగా చర్చ జరిగింది. తీర్మానంపై చర్చలో భాగంగా
మాట్లాడిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విపక్షాలపై విరుచుకుపడ్డారు. దేశానికి
కాంగ్రెస్ చేసిందేమీ లేదని మండిపడ్డారు. అనేక వాయిదాల అనంతరం మణిపుర్ అంశంపైనా
సభలో చర్చ జరిగింది.