ప్రపంచమే అబ్బురంగా చూస్తోంది: మోదీ
త్వరలో దేశమంతటా సూర్యగ్రామాలు
న్యూఢిల్లీ: ‘‘సౌర, అంతరిక్ష రంగాల్లో భారత్ అద్భుతాలు చేస్తోంది. ఆ రంగాల్లో మనం సాధిస్తున్న విజయాలను చూసి ప్రపంచమే ఆశ్చర్యపోతోంది’’ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 36 ఉపగ్రహాలను ఇస్రో ఒకేసారి విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రయోగించడాన్ని దేశానికి యువత ఇచ్చిన ప్రత్యేక దీపావళి కానుకగా అభివర్ణించారు. ఆదివారం నెలవారీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘స్వయంసమృద్ధి దిశగా మా ప్రభుత్వం చేస్తున్న కృషికి ఇది తాజా తార్కాణం. ఒకప్పుడు మనకు క్రయోజనిక్ రాకెట్లు ఇచ్చేందుకు నిరాకరించారు. కానీ మన శాస్త్రవేత్తలు దాన్ని సవాలుగా తీసుకుని దేశీయ పరిజ్ఞానం సాయంతోనే వాటిని నిర్మించి చూపించారు. ఇప్పుడు పుంఖానుపుంఖాలుగా ఉపగ్రహాలను పంపి చూపుతున్నారు. ఫలితంగా ప్రపంచ అంతరిక్ష వాణిజ్య మార్కెట్లో్ల భారత్ పెద్ద శక్తిగా నిలిచింది. అంతరిక్షంలోనూ ప్రైవేటు రంగానికి తలుపులు తెరవడంతో కొత్త స్టార్టప్‌లు పుట్టుకొచ్చి విప్లవాత్మక మార్పులు తెస్తున్నాయి’’ అన్నారు. మోదెరా స్ఫూర్తి: ప్రపంచమంతా పర్యావరణహిత సౌర విద్యుత్ కేసి మళ్లుతోందని మోదీ అన్నారు. ‘‘పీఎం కుసుమ్ యోజన ద్వారా ఎంతోమంది ఇళ్లపై సోలార్ ప్లాంట్లు పెట్టుకున్నారు. కరెంటు బిల్లులు తగ్గించుకోవడంతో పాటు మిగులు విద్యుత్‌ను విక్రయించి లాభపడుతున్నారు. గుజరాత్‌లోని మోదెరా దేశంలో తొలి సోలార్ గ్రామంగా నిలిచింది. ఈ స్ఫూర్తితో దేశమంతటా సూర్యగ్రామ్లు వెలుస్తాయి. ఇది త్వరలోనే భారీ ప్రజా ఉద్యమంగా మారడం ఖాయం’’ అని జోస్యం చెప్పారు.
పాత సవాళ్లు వదిలేద్దాం: న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ ప్రతి భారతీయుడికి ఒక గర్వకారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పాత సవాళ్లను ఇక వదిలేద్దామని, నూతన అవకాశాల నుంచి లబ్ధి పొందుదామని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం జమ్మూకశ్మీర్‌లో నిర్వహించిన రోజ్‌గార్ మేళానుద్దేశించి ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. వేగవంతమైన అభివృద్ధి కోసం కొత్తగా ఆలోచించాలని, కొత్త మార్గంలో పయనించాలని సూచించారు. అభివృద్ధి ఫలాలు సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు సమానంగా అందాలన్నదే తమ ఆశయమని ఉద్ఘాటించారు. మనమంతా కలిసి జమ్మూకశ్మీర్‌ను ఉన్నత శిఖరాలను చేర్చుదామని పిలుపునిచ్చారు. 21వ శతాబ్దంలో ప్రస్తుత దశాబ్దం జమ్మూకశ్మీర్ చరిత్రలో చాలా ముఖ్యమైన దశాబ్దమని చెప్పారు. పాత సవాళ్లను పక్కనపెట్టాల్సిన సమయం వచ్చిందన్నారు. జమ్మూకశ్మీర్‌లో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలకు ఎంపికై, రోజ్‌గార్ మేళాలో నియామక పత్రాలు అందుకున్న 3,000 మంది యువతకు ప్రధాని మోదీ అభినందనలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో మరో 700 మందికి అపాయింట్మెంట్ లెటర్లు అందజేయడానికి చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. జమ్మూకశ్మీర్‌లో పర్యాటకుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగిందని హర్షం వ్యక్తం చేశారు.
తయారీ హబ్‌గా భారత్
వడోదర: రవాణా విమానాల తయారీలో భారత్ అగ్రగామిగా మారబోతోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గుజరాత్‌లోని వడోదరలో రూ.22 వేల కోట్లతో యూరోపియన్ సి–295 మధ్యతరహా రవాణా విమానాల తయారీ కేంద్రానికి ఆయన ఆదివారం శంకుస్థాపన చేశారు. భారత వైమానిక దళం(ఐఏఎఫ్) కోసం ఈ విమానాలను తయారు చేయబోతున్నారు. ప్రపంచంలో భారత్ అతిపెద్ద తయారీ హబ్‌గా అవతరించిందని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా తెలిపారు. దేశంలో ఆర్థిక సంస్కరణ విషయంలో నూతన చరిత్రను రాస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలు స్థిరంగా, దార్శనికతతో కూడి ఉన్నాయన్నారు.
కొత్త మైండ్‌సెట్, కొత్త వర్క్‌కల్చర్‌తో ఇండియా ముందడుగు వేస్తోందని చెప్పారు. పెద్ద పెద్ద వాణిజ్య విమానాలు కూడా మన దేశంలో తయారయ్యే రోజులను మనం చూడబోతున్నామని తెలిపారు. ‘మేక్ ఇన్ ఇండియా’తోపాటు ‘మేక్ ఫర్ వరల్డ్’ అనేదే మన నినాదమని వివరించారు. సి–295 ఎయిర్‌క్రాఫ్ట్‌లతో భారత వైమానిక దళం బలోపేతం కావడంతోపాటు మనదేశంలో విమానయాన రంగానికి ప్రోత్సాహం లభిస్తుందని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. రక్షణ రంగంలో స్వావలంబన సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని, ఆ దిశగా ఇదొక మైలురాయి అని అభివర్ణించారు.