న్యూఢిల్లీ : జీ20 శిఖరాగ్ర సదస్సును విజయవంతంగా నిర్వహించిన ప్రధాని నరేంద్ర
మోడీ పై కూటమి నేతలు ప్రశంసల వర్షం కురిపించారు. మోడీ నిర్ణయాత్మక
నాయకత్వాన్ని కొనియాడారు. భారతదేశం తమకు అపూర్వనమైన ఆతిథ్యం ఇచ్చిందని
పేర్కొన్నారు. ఒకే భూగోళం, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అంటూ భారత్ ఇస్తున్న
సందేశాన్ని వారు ప్రత్యేకంగా ప్రస్తావించారు. తమను ఒకే వేదికపై తీసుకొచ్చిన
మోడీకి కృతజ్ఞతలు తెలిపారు.
సవాళ్లను కలిసికట్టుగా ఎదిరించగలమనే సామర్థ్యం మనకు ఉందన్న విషయాన్ని మోడీ
మరోసారి గుర్తుచేశారని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. డిజిటల్
సాధనాలు, టెక్నాలజీ సాయంతో ప్రభుత్వ సేవలను మారుమూల గ్రామాలకు సైతం సులభంగా
చేర్చవచ్చని మోడీ నిరూపించారని యూకే ప్రధానమంత్రి రిషి సునాక్ తెలియజేశారు.
జీ20లో ఆఫ్రికన్ యూనియన్‌కు సభ్వత్యం కల్పించడంలో మోదీకి కీలక పాత్ర అని
పలువురు నాయకులు వెల్లడించారు. ‘గ్లోబల్ సౌత్’ గళాన్ని బలంగా వినిపించడంలో
మోదీ ముందంజలో ఉంటున్నారని బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా వివరించారు.
బ్రెజిల్‌కు నరేంద్ర మోడీ మద్దతు : ప్రధాని మోడీ జీ20 తదుపరి అధ్యక్ష
బాధ్యతలను బ్రెజిల్‌కు అప్పగించారు. ఇందుకు గుర్తుగా అధికార దండాన్ని
(గావెల్) బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇన్సియో లూలా డా సిల్వాకు అందజేశారు.
కూటమి అధ్యక్ష బాధ్యతలను బ్రెజిల్ ఈ ఏడాది డిసెంబర్ 1న అధికారికంగా
చేపట్టనుంది. జీ20 అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్న బ్రెజిల్‌కు నరేంద్ర మోడీ
పూర్తి మద్దతు ప్రకటించారు. అధ్యక్షుడు లూయిజ్ ఇన్సియో లూలా డా సిల్వాను
అభినందించారు. కూటమి దేశాల ఉమ్మడి లక్ష్యాలను జీ20 సారథిగా బ్రెజిల్ మరింత
ముందుకు తీసుకెళ్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. జీ20 సదస్సు
ముగిసినట్టు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. వసుధైక కుటుంబానికి
రోడ్‌మ్యాప్ దిశగా మనం ముందుకు సాగుదామని కూటమి దేశాలకు పిలుపునిచ్చారు.
మరిన్ని దేశాలకు శాశ్వత సభ్యత్వం కల్పించాలి: లూలా డా సిల్వా
అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు ప్రారంభించాలన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర
మోదీ వినతికి బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డా సిల్వా మద్దతు పలికారు. కొత్తగా
అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం
కల్పించాలని డిమాండ్ చేశారు. మరికొన్ని దేశాలకు నాన్–పర్మింనెంట్ హోదా
కల్పించాలన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ
ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్)లోనూ సరైన ప్రాతినిధ్యం ఉండాలని చెప్పారు. ఐరాస
భద్రతా మండలిలో ప్రస్తుతం అమెరికా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, రష్యాకు మాత్రమే
శాశ్వత సభ్యత్వం ఉంది.