గుజరాత్లో ఘోర ప్రమాదం జరిగింది. మోర్బి జిల్లాలో మచ్చూ నదిపై కేబిల్ బ్రిడ్జీ కుప్పకూలింది. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. 68 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో బ్రిడ్జిపై ఉన్న సందర్శకులంతా నదిలో పడిపోయారు. ప్రమాద సమయంలో బ్రిడ్జిపై 500 మంది వరకు ఉన్నారని, 100 మంది వరకు నీటిలో చిక్కుకున్నారని రిపోర్టులు పేర్కొంటున్నాయి. కాగా కొన్నేళ్లక్రితమే ఈ బ్రిడ్జిని నిర్మించారు. ఇటివలే పునరుద్ధరణ తర్వాత 5 రోజుల క్రితమే ఈ బ్రిడ్జీని పున:ప్రారంభించారు.
నదిలో పడిపోయినవారి కోసం స్థానికుల సాయంతో అధికారులు గాలించు పలువురిని కాపాడారు. . రెండు బృందాలు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ హూటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. మృతుల కుటుంబాలకు గుజరాత్ ప్రభుత్వం రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ప్రమాదంలో గాయపడినవారికి రూ.50 వేల సాయం ప్రకటించింది. ఈ ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మూడు రోజుల గుజరాత్ పర్యటనలో ఉన్న మోదీ ముఖ్యమంత్రితో ఫోన్లో మాట్లాడారు. ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘‘ మోర్బి ప్రమాద ఘటనపై గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఇతర అధికారులతో మాట్లాడాను. రెస్క్యూ ఆపరేషన్ కోసం మొబైలేషన్ బృందాలను తక్షణమే ఘటనా స్థలానికి పంపించాలని కోరాను. అక్కడి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాను. అవసరమైన సహయసహకారాలన్నీ అందిస్తాం’’ అని పేర్కొంటూ మోదీ ట్వీట్ చేశారు.